అక్కడ పెళ్లి వేడుక సందడిగా సాగుతోంది. నూతన దంపతులను ఆశీర్వదించడానికి వచ్చిన బంధువులు, అతిథులతో అక్కడ సందడి వాతావరణం నెలకొంది. ఇంతలోనే అక్కడ ఊహించని పరిణామం.. ఏం జరిగిందో తెలుసుకునే ఆరుగురు గాయపడ్డారు. అసలు కారణం ఏంటా అని ఆరా తీయగా.. విషయం తెలిసి అతిథులు విస్తుపోయారు. రసగుల్లాల కోసం జరిగిన గొడవలో ఆరుగురు గాయపడిన ఘటన ఉత్తర్ ప్రదేశ్‌లోని ఆగ్రాలో చోటు చేసుకుంది. ఆగ్రాలోని ఓ వివాహ కార్యక్రమంలో రసగుల్లాల కొరతపై జరిగిన ఘర్షణలో ఆరుగురు గాయపడినట్లు పోలీసులు సోమవారం తెలిపారు.
ఆదివారం అర్ధరాత్రి ఈ ఘటన జరిగినట్లు సమాచారం. క్షతగాత్రులను ఆసుపత్రికి తరలించామని, వారి పరిస్థితి నిలకడగా ఉందని వారు తెలిపారు. ఈ ఘటనలో ఆరుగురికి గాయాలయ్యాయని, కేసు నమోదు చేశామని, ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న వారు ప్రమాదం నుంచి బయటపడ్డారని శంషాబాద్ పోలీస్ స్టేషన్ ఎస్‌హెచ్‌ఓ అనిల్ శర్మ తెలిపారు. "ఆదివారం బ్రిజ్‌భాన్ కుష్వాహా నివాసంలో వివాహ కార్యక్రమం ఉంది.. ఆ ఫంక్షన్‌లో ఒక వ్యక్తి రసగుల్లాల కొరతపై వ్యాఖ్యానించాడు" అని అతను చెప్పాడు. దీంతో గొడవ జరిగి భగవాన్ దేవి, యోగేష్, మనోజ్, కైలాష్, ధర్మేంద్ర, పవన్ గాయపడ్డారని శర్మ తెలిపారు.
అక్టోబరు 2022లో ఎత్మాద్‌పూర్‌లోని ఒక వివాహ వేడుకలో స్వీట్ల కొరతపై జరిగిన గొడవలో ఒక వ్యక్తి చనిపోయాడు.