3వ దశ లోక్‌సభ ఎన్నికలకు రేపటి నుంచి నామినేషన్ల ప్రక్రియ ప్రారంభం

2024 సార్వత్రిక ఎన్నికల మూడో దశ నామినేషన్ల దాఖలు ప్ర‌క్రియ‌ శుక్రవారం నుంచి ప్రారంభమవుతుందని ఎన్నికల సంఘం తెలిపింది

By Medi Samrat  Published on  11 April 2024 5:00 PM IST
3వ దశ లోక్‌సభ ఎన్నికలకు రేపటి నుంచి నామినేషన్ల ప్రక్రియ ప్రారంభం

2024 సార్వత్రిక ఎన్నికల మూడో దశ నామినేషన్ల దాఖలు ప్ర‌క్రియ‌ శుక్రవారం నుంచి ప్రారంభమవుతుందని ఎన్నికల సంఘం తెలిపింది. "2024 సార్వత్రిక ఎన్నికల మూడవ దశ నామినేషన్లు రేపటి నుండి ప్రారంభమవుతాయి" అని ఎల‌క్ష‌న్ క‌మిష‌న్‌ గురువారం తెలిపింది. మూడ‌వ ద‌శ‌లో 12 రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాలలోని (UT) 94 నియోజకవర్గాల్లో మే 7న ఓటింగ్ జరుగుతుంది. ఓట్ల లెక్కింపు జూన్ 4న జరుగుతుంది.

లోక్‌సభ ఎన్నికలు ఏడు దశల్లో జరుగ‌నున్నాయి. దేశవ్యాప్తంగా ఉన్న ప్ర‌జ‌లు ఏప్రిల్ 19, ఏప్రిల్ 26, మే 7, మే 13, మే 20, మే 25, జూన్ 1 తేదీల్లో నిర్దేశిత స‌మ‌యం, ప్రాంతానికి అనుకూలంగా త‌మ ఓటు హ‌క్కును వినియోగించుకోనున్నారు.

లోక్‌సభ 2024 ఎన్నికలకు సంబంధించి 12 రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాల్లోని 94 పార్లమెంటరీ నియోజకవర్గాల (పీసీలు) గెజిట్ నోటిఫికేషన్ రేపు విడుదల కానుంది” అని ఈసీ విడుదల చేసిన ప్రకటన తెలిపింది.

అస్సాం, బీహార్, ఛత్తీస్‌గఢ్, గోవా, గుజరాత్, జమ్మూ మరియు కాశ్మీర్, కర్ణాటక, మహారాష్ట్ర, మధ్యప్రదేశ్, ఉత్తరప్రదేశ్, పశ్చిమ బెంగాల్ రాష్ట్రాల‌తో స‌హా దాద్రా, నగర్ హవేలీ, డామన్ మరియు డయ్యూ కేంద్ర పాలిత ప్రాంతాల‌లో మూడ‌వ ద‌శ‌లో ఎన్నిక‌లు జ‌రుగ‌నున్నాయి.

మూడ‌వ ద‌శ లోక్‌స‌భ ఎన్నిక‌ల‌లో పోటీచేసే అభ్య‌ర్ధులు నామినేషన్లు దాఖలు చేయడానికి చివరి తేదీ ఏప్రిల్ 19 కాగా.. నామినేషన్ల పరిశీలన ఏప్రిల్ 20న ఉంటుంది. నామినేష‌న్ల‌ ఉపసంహరణకు చివరి తేదీ ఏప్రిల్ 22.

Next Story