దాదాపు 100 మీటర్ల పొడవున్న రెండు భారీ టవర్లు శిథిలాల కుప్పగా మారడానికి కేవలం సెకన్లు పట్టింది. నోయిడాలోని ఐకానిక్ ట్విన్ టవర్లు కూలిన క్షణాలకు సంబంధించిన వీడియో ప్రస్తుతం నెట్టింట వైరల్‌గా మారింది. వివరాళ్లోకెళితే.. నోయిడాలోని సూపర్‌టెక్ ట్విన్ టవర్లు ఒక్క బటన్ నొక్కడంతో ఒక్కసారిగా పేకమేడలా పడిపోయాయి. దాదాపు 100 మీటర్ల పొడవున్న భారీ టవర్లు శిథిలావస్థకు చేరుకోవడానికి కేవలం సెకన్లు టైం మాత్రమే పట్టింది. ట్విన్ టవర్లను కూల్చడానికి 3,700 కిలోల పేలుడు పదార్థాలను ఉపయోగించారు. "వాటర్ ఫాల్ టెక్నిక్" ద్వారా రెండు టవర్లను నేరుగా ఉన్నచోటే కూల్చారు. టవర్లు పడిపోయిన కొన్ని సెకన్ల తరువాత, చుట్టుపక్కల దుమ్ము తప్ప మరేమీ కనిపించలేదు.
కూల్చివేతకు ముందు.. నోయిడాలోని సూపర్‌టెక్ ట్విన్ టవర్స్ చుట్టూ ఉన్న ప్రాంతమంతా జనాలు పెద్ద సంఖ్యలో హాజరయ్యారు. సమయం సమీపిస్తున్న కొద్దీ.. సైట్‌లోని అధికారులు ఎటువంటి తప్పు జరగకుండా చూసేందుకు చివరి నిమిషం వరకూ సన్నాహాల్లో బిజీగా ఉన్నారు. జాతీయ విపత్తు ప్రతిస్పందన దళం (NDRF), ఉత్తరప్రదేశ్ ప్రావిన్షియల్ ఆర్మ్‌డ్ కాన్‌స్టాబులరీలను ఆకస్మిక పరిస్థితుల నేపథ్యంలో మైదానంలో అందుబాటులో ఉంచారు.