ఇంట్లో నోట్ల కట్టల కేసు..జస్టిస్ వర్మకు సుప్రీంకోర్టులో నో రిలిఫ్‌

జస్టిస్ యశ్వంత్ వర్మను తొలగించాలని సిఫార్సు చేసిన అంతర్గత విచారణ నివేదికను సవాలు చేస్తూ ఆయన దాఖలు చేసిన పిటిషన్‌ను సుప్రీంకోర్టు గురువారం కొట్టివేసింది.

By Knakam Karthik
Published on : 7 Aug 2025 10:59 AM IST

National News, Delhi, Justice Yashwant Varma, Supreme Court

ఇంట్లో నోట్ల కట్టల కేసు..జస్టిస్ వర్మకు సుప్రీంకోర్టులో నో రిలిఫ్‌

ఈ ఏడాది ప్రారంభంలో ఢిల్లీ హైకోర్టు జడ్జి జస్టిస్ యశ్వంత్ వర్మ నివాసంలో పెద్ద మొత్తంలో డబ్బుకట్టలు బయటపడిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలో జస్టిస్ యశ్వంత్ వర్మను తొలగించాలని సిఫార్సు చేసిన అంతర్గత విచారణ నివేదికను సవాలు చేస్తూ ఆయన దాఖలు చేసిన పిటిషన్‌ను సుప్రీంకోర్టు గురువారం కొట్టివేసింది. ఈ పిటిషన్‌ ఆయనపై వచ్చిన ఆరొపణలకు సంబంధించి, కాలిపోయిన కరెన్సీ నోట్ల స్వాధీనం విషయంలో నిర్వహించిన ఇంటర్నల్ విచారణ నివేదికను సవాలు చేస్తూ దాఖలైంది.

తీర్పు వినిపించిన జస్టిస్ దీపాంకర్ దత్తా, “భవిష్యత్‌లో ఎలాంటి ప్రాసీజింగ్స్‌లో పిటిషనర్‌కు నష్టం కలగకుండా ఎంతో జాగ్రత్తగా తాము తీర్పు ఇచ్చాం” అని స్పష్టం చేశారు. అంతేకాక, కోర్టు నిర్ణయించాల్సిన ఆరు కీలక ప్రశ్నలను చర్చించింది. సిట్టింగ్ జడ్జికి వ్యతిరేకంగా ఇంటర్‌నల్ విచారణ ప్రక్రియను సవాలు చేస్తూ దాఖలైన రిట్ పిటిషన్‌ను కోర్టు న్యాయబద్ధమైనదిగా పరిగణించలేదు. ఇంటర్‌నల్ విచారణకు చట్టపరమైన గుర్తింపు ఉంది. ఇది రాజ్యాంగానికి భిన్నంగా ఏర్పాటు చేసిన వ్యవస్థ కాదని కోర్టు స్పష్టం చేసింది. పిటిషనర్ మౌలికహక్కులు ఉల్లంఘించబడినట్లు ఎలాంటి ఆధారాలు లేవని కోర్టు తేల్చింది. భారత ప్రధాన న్యాయమూర్తి, విచారణ కమిటీ అంతా నిబంధనలను కఠినంగా పాటించారని కోర్టు తెలిపింది. ఫోటోలు, వీడియోలు అప్‌లోడ్ చేయకపోయినా, అప్పట్లో ఎటువంటి అభ్యంతరం చెప్పలేదని పేర్కొంది. ప్రధానమంత్రి, రాష్ట్రపతికి నివేదిక పంపడాన్ని రాజ్యాంగ విరుద్ధంగా పరిగణించలేమని కోర్టు తేల్చింది. తగిన న్యాయ మార్గాలను అనుసరించి న్యాయమూర్తి వర్మ తమ సమస్యలను భవిష్యత్తులో వ్యక్తీకరించేందుకు వీలుంటుందని కోర్టు సూచించింది. అంతర్గత కమిటీ ఏర్పాటు, దానిని అనుసరించిన విచారణ విధానం చట్టవిరుద్ధం కాదని తీర్పు చెప్పింది.

Next Story