భారత్ లో చలామణీలో ఉన్న నోట్ల విషయంలో ఎన్నో వదంతులు సామాజిక మాధ్యమాల్లో వైరల్ అవుతూ ఉంటాయి. వాటిపై ఎప్పటికప్పుడు రిజర్వ్ బ్యాంకు ఆఫ్ ఇండియా (ఆర్బీఐ) క్లారిటీ ఇస్తోంది. ఇటీవలి కాలంలో పాత 100 రూపాయల నోట్లను నిలిపివేస్తూ ఉన్నారనే కథనాలు మీడియాలోనూ, సామాజిక మాధ్యమాల్లోనూ వైరల్ అయ్యాయి. ఈ వదంతులను నమ్మకండంటూ చెప్పుకొచ్చింది. దేశంలో రూ.100, రూ.10, రూ.5 కరెన్సీ నోట్లు ఎప్పటినుంచో చలామణిలో ఉండగా.. ఈ మూడు నోట్లను రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా రద్దు చేస్తోందంటూ గత కొన్నిరోజులుగా ప్రచారం జరుగుతోంది.
ఈ ఏడాది మార్చి నుంచి ఆ మూడు రకాల నోట్లు చెల్లుబాటు కావని ప్రచారం చేస్తూ వచ్చారు. ఈ వదంతులపై ఆర్బీఐ స్పందిస్తూ.. భవిష్యత్తులో రూ.100, రూ.10, రూ.5 నోట్లను ఉపసంహరించుకుంటున్నామని మీడియాలోని ఓ వర్గంలో జరుగుతున్న ప్రచారంలో నిజం లేదని స్పష్టం చేసింది. తమకు అలాంటి ఉద్దేశాల్లేవని ఆర్బీఐ) ట్విట్టర్ ద్వారా వెల్లడించింది. 2016లో రూ.1000, రూ.500 పాత నోట్లను రద్దు చేసింది కేంద్రం. 2018లో రూ.10, రూ.50తో పాటు కొత్తగా రూ.200 నోట్లను ముద్రించింది ఆర్బీఐ. 2019లో సరికొత్త రూ.100 నోట్లను తీసుకువచ్చింది.