కర్నాటక అసెంబ్లీ ఎన్నికల కౌంటింగ్‌కు సమయం ఆసన్నమైంది. ఎగ్జిట్ పోల్స్ బీజేపీ, కాంగ్రెస్‌లకు దగ్గర దగ్గరగా స్థానాలు వస్తాయని.. జెడి(ఎస్) కీలకంగా మారబోతోందని తెలిపాయి. దీంతో ఆ పార్టీ నాయకుడు హెచ్‌డి కుమారస్వామి ఏ వైపు మొగ్గుతారా అనే విషయమై చర్చ జరుగుతోంది. కర్నాటకలో హంగ్ అసెంబ్లీ ఏర్పడితే, జేడీ(ఎస్) కింగ్‌మేకర్‌గా మారబోతోంది. "తమను ఇంకా ఏ పార్టీ సంప్రదించలేదని కుమారస్వామి తెలిపారు. తమది చాలా చిన్న పార్టీ అని.. తమకు ఎలాంటి డిమాండ్స్ లేవు" అని కుమారస్వామి అన్నారు. తాము కేవలం అభివృద్ధిని ఆశిస్తున్నాము అని కుమారస్వామి చెప్పినట్లు ANI పేర్కొంది.
ఓట్ల లెక్కింపు ఉదయం 8 గంటలకు ప్రారంభం కానుంది. అధికారం కైవసం చేసుకోడానికి 113 సీట్ల మార్కు దాటాల్సి ఉంది. కర్నాటకలో 73.19 శాతం ఓటింగ్ నమోదైనట్లు రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి తెలిపారు. చిక్కబళ్లాపుర జిల్లాలో అత్యధికంగా 85.56 శాతం ఓటింగ్ శాతం నమోదు కాగా, రాష్ట్ర రాజధాని బెంగళూరులోని దక్షిణ డివిజన్‌లో అత్యల్పంగా 52.33 శాతం ఓటింగ్ నమోదైంది.