తాజా బడ్జెట్ లో పెట్రోల్, డీజిల్ ధరలపై సెస్ పేరుతో మరింత భారం వేసింది కేంద్ర ప్రభుత్వం. అగ్రికల్చర్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ అండ్ డెవలప్‌మెంట్ సెస్ పేరుతో పెట్రోల్‌పై రూ.2.5, డీజిల్‌పై రూ.4 సెస్ విధించారు. దీంతో పెట్రోల్, డీజిల్ ధరలు మరింత పెరగనున్నాయి. రోజువారీ ధరల సమీక్ష అమల్లోకి వచ్చిన తర్వాత పెట్రోల్, డీజిల్ ధరలు ప్రతీ రోజూ పెరుగుతూనే ఉన్నాయి. గత పదిరోజుల్లోనే దాదాపు రెండు రూపాయలు పెరిగాయి. ముంబయిలో లీటర్ పెట్రోలు 93 రూపాయలకు చేరుకుంది. ఇప్పుడు కేంద్రం ప్రతిపాదించిన సెస్ అమల్లోకి వస్తే.. పెట్రోల్ ధర వంద రూపాయలు దాటడం ఖాయమనే వార్తలు ప్రజలను టెన్షన్ పెడుతూ ఉన్నాయి.
ఈ వార్తలపై ఆర్థికమంత్రి నిర్మలా సీతారామన్ క్లారిటీ ఇచ్చారు. పెట్రోల్, డీజిల్ పై వ్యవసాయ సెస్సు విధింపుపై తీవ్ర వ్యతిరేకత వ్యక్తం అవుతోన్న నేపథ్యంలో ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ స్పందించారు. సెస్సు విధింపు వల్ల పెట్రోల్, డీజిల్ ధరలు పెరగబోవని స్పష్టం చేశారు. వ్యవసాయ సెస్ విధించి ఇతర ట్యాక్స్‌లు తగ్గిస్తామని స్పష్టం చేశారు. సెస్‌ల భారాన్ని సుంకం నంచి మినహాయిస్తామని భరోసా ఇచ్చారు. దీంతో పెట్రోల్, డీజిల్ ధరలు అలాగే ఉంటాయని నిర్మలా సీతారామన్ తెలిపారు. కేంద్ర బడ్జెట్‌లో కాటన్‌పై 10శాతం కస్టమ్స్ డ్యూటీ పెంపుతో దిగుమతి చేసుకునే ప్రీమియం దుస్తుల ధర మరింత పెరగనుంది. లెదర్ ఉత్పత్తులు, సోలార్ ఇన్వెర్టర్ల ధరలు పెరగనున్నాయి. ఆటోమొబైల్ రంగంలో కస్టమ్ డ్యూటీ పెంపుతో కార్ల విడిభాగాల ధరలు కూడా పెరగనున్నాయి.