బెంగళూరులో విషాద ఘటన చోటు చేసుకుంది. నడిరోడ్డుపై 34 ఏళ్ల వ్యక్తి గుండెపోటుతో మరణించాడు. బాటసారుల నుండి తక్షణ సహాయం అందలేదు. అందరూ చూసుకుంటూ వెళ్లారే తప్ప.. ఒక్కరు కూడా సహాయం చేయడానికి ముందుకు రాలేదు. డిసెంబర్ 13న బనశంకరిలోని కదిరేనహళ్లి ప్రాంతంలో ద్విచక్ర వాహనం నడుపుతుండగా ఆ వ్యక్తికి గుండెపోటు వచ్చింది.
అతను రోడ్డుపై కుప్పకూలిన తర్వాత అతనితో పాటు ఉన్న అతని భార్య సహాయం కోరింది, కానీ తక్షణ సహాయం అందుబాటులో లేదు. CCTV ఫుటేజ్‌లో, ఆమె సహాయం అడుగుతున్నట్లు కనిపించింది, కానీ ఏ ఒక్క వాహనదారుడు కూడా ఆగలేదు. అంబులెన్స్ లేకపోవడంతో, ఆ జంట ద్విచక్ర వాహనంపై ఆసుపత్రికి చేరుకోవడానికి ప్రయత్నించారు. అయితే, ఆ వ్యక్తి మార్గమధ్యలో మరణించాడు.
గత వారం జరిగిన మరో సంఘటనలో.. ఆంధ్రప్రదేశ్‌లోని అంబేద్కర్ కోనసీమ జిల్లాలోని ఒక ప్రైవేట్ పాఠశాలలోని తరగతి గదిలో క్లాస్ వింటూనే 14 ఏళ్ల టెన్త్ విద్యార్థి కుప్పకూలిపోయింది. ఆమె అకస్మాత్తుగా స్పృహ కోల్పోయి కుప్పకూలిపోయిందని పాఠశాల అధికారులు తెలిపారు. ఆమెను వెంటనే రామచంద్రపురం ఏరియా ఆసుపత్రికి తరలించారు, అక్కడ వైద్యులు ఆమె మరణించినట్లు ప్రకటించారు.