కర్ణాటక ముఖ్యమంత్రి సిద్ధరామయ్యకు కోర్టు కాస్త ఉపశమనం కల్పించింది. మైసూరు నగరాభివృద్ధి సంస్థ (ముడా) కుంభకోణానికి సంబంధించి ఆయనపై ప్రత్యేక కోర్టులో విచారణను కర్ణాటక హైకోర్టు సోమవారం వాయిదా వేసింది. ముడా కేసులో ముఖ్యమంత్రి సిద్ధరామయ్యకు కర్ణాటక హైకోర్టులో తాత్కాలిక ఊరట లభించింది.
సిద్ధరామయ్యపై సామాజిక కార్యకర్త స్నేహమయి కృష్ణ దాఖలు చేసిన పిటిషన్ ప్రజాప్రతినిధుల ప్రత్యేక కోర్టులో విచారణకు వచ్చింది. టీజే అబ్రహం వేసిన మరో పిటిషన్‌పై బుధవారం వాదనలు జరగాల్సి ఉంది. ఇప్పుడు హైకోర్టు ఆదేశాల ప్రకారం తదుపరి విచారణ ఆగస్టు 29 వరకు చేపట్టారు. ఈ కేసులో విచారణ పూర్తయ్యే వరకు సిద్ధరామయ్యపై ఎలాంటి చర్యలు తీసుకోవద్దంటూ ఆదేశాలు జారీ చేసింది. ముఖ్యమంత్రి దాఖలు చేసిన పిటిషన్‌పై బుధవారం విచారణ కొనసాగుతుందని వెల్లడించింది.
ముడా కుంభకోణంలో సిద్ధరామయ్యను విచారించాలని గవర్నర్ థావర్‌చంద్ గెహ్లాట్ ఉత్తర్వులు జారీ చేశారు. ఈ ఉత్తర్వులపై సిద్ధరామయ్య హైకోర్టును ఆశ్రయించారు. తాను ఎలాంటి తప్పు చేయలేదని, రిట్ పిటిషన్‌లో ప్రాసిక్యూషన్ నుంచి తాత్కాలిక ఉపశమనం కల్పించేలా ఉత్తర్వులు జారీ చేయాలని హైకోర్టును కోరారు. ఈరోజు విచారణ జరిపిన హైకోర్టు విచారణ పూర్తయ్యే వరకు ఎలాంటి చర్యలు తీసుకోవద్దని ఆదేశాలు జారీ చేసింది.