ఢిల్లీ పేలుడు ఘటన..ఆ నలుగురు డాక్టర్లపై NMC సంచలన నిర్ణయం
ఉగ్రవాద కార్యకలాపాలతో సంబంధాలు ఉన్నాయన్నఆరోపణలపై జాతీయ మెడికల్ కమిషన్ సంచలన నిర్ణయం తీసుకుంది.
By - Knakam Karthik |
ఢిల్లీ పేలుడు ఘటన..ఆ నలుగురు డాక్టర్లపై NMC సంచలన నిర్ణయం
ఢిల్లీ: ఉగ్రవాద కార్యకలాపాలతో సంబంధాలు ఉన్నాయన్నఆరోపణలపై జాతీయ మెడికల్ కమిషన్ సంచలన నిర్ణయం తీసుకుంది. నలుగురు డాక్టర్ల రిజిస్ట్రేషన్లను రద్దు చేస్తూ, దేశంలో ఎక్కడా వైద్య వృత్తి చేపట్టకుండా వారిపై నిషేధం విధించింది. ఈ ఉత్తర్వులు తక్షణమే అమల్లోకి వస్తాయని స్పష్టం చేసింది. ఢిల్లీ ఎర్రకోట సమీపంలో జరిగిన కారు బాంబు పేలుడు కేసుకు సంబంధించి ఉగ్రవాద మాడ్యూల్‌తో వీరికి సంబంధాలున్నట్లు తేలడంతో ఈ కఠిన చర్యలు తీసుకున్నారు.
ఎన్ఎంసీ ఆదేశాల ప్రకారం డాక్టర్ ముజాఫర్ అహ్మద్, డాక్టర్ అదీల్ అహ్మద్ రాదర్, డాక్టర్ ముజమ్మిల్ షకీల్, డాక్టర్ షాహీన్ సయీద్ల పేర్లను ఇండియన్ మెడికల్ రిజిస్ట్రీ, నేషనల్ మెడికల్ రిజిస్ట్రీ నుంచి తొలగించారు. జమ్మూకశ్మీర్ పోలీసులు అందించిన సమాచారం, ఉగ్రవాద కార్యకలాపాల నిరోధక చట్టం కింద నమోదైన ఎఫ్ఐఆర్, రాష్ట్ర మెడికల్ కౌన్సిల్ నివేదిక ఆధారంగా ఈ నిర్ణయం తీసుకున్నట్లు ఎన్ఎంసీ వెల్లడించింది. ఎన్ఎంసీ ఆదేశాల మేరకు సంబంధిత
రాష్ట్రాల మెడికల్ కౌన్సిళ్లు కూడా ఈ నలుగురు డాక్టర్ల పేర్లను తమ రిజిస్టర్ల నుంచి తొలగించాయి.
ఇదే కేసుకు సంబంధించి, ప్రధాన నిందితుడైన డాక్టర్ ఉమర్-ఉన్-నబీ అలియాస్ ఉమర్ మహ్మద్‌కు చెందిన ఇంటిని భద్రతా బలగాలు ఇటీవల పుల్వామాలో పేల్చివేసిన విషయం తెలిసిందే. తాజా పరిణామం ఈ కేసులో మరింత ప్రాధాన్యం సంతరించుకుంది.