బీహార్‌లో కల్తీ మద్యం సేవించి చప్రా, సరన్ జిల్లాల్లో పదుల సంఖ్యలో మరణించారు. అయితే మృతులకు ఎలాంటి పరిహారం అందిచబోమని సీఎం నితీష్ కుమార్ స్పష్టం చేశారు. నితీష్ శుక్రవారం రాష్ట్ర అసెంబ్లీలో మాట్లాడుతూ.. మద్యం తాగితే మీరు మరణిస్తారని ప్రజలకు చెబుతున్నామని, మద్యపానానికి అనుకూలంగా మాట్లాడిన వారెవరూ.. మీకు ఎలాంటి మేలు చేయరని పేర్కొన్నారు. 2016 ఏప్రిల్‌లో నితీష్ కుమార్ సర్కార్ బిహార్‌లో మద్యం తయారీ, విక్రయాలను నిషేధించింది. చప్రా జిల్లాలో కల్తీ మద్యం సేవించి పదుల సంఖ్యలో మరణించిన ఘటన మరువకముందే సివన్ జిల్లాలోని భగవాన్‌పూర్ పోలీస్ స్టేషన్ పరిధిలో కల్తీ మద్యం సేవించిన నలుగురు వ్యక్తులు మరణించారు.
చప్రా కల్తీ మద్యం వ్యవహారంలో ప్రత్యక దర్యాప్తు బృందం (సిట్)చే విచారణ జరిపించాలని కోరుతూ సుప్రీంకోర్టులో పిటిషన్ నమోదైంది. బిహార్‌లో మద్యం తయారీ, విక్రయం, అక్రమ మద్యం నియంత్రణ కోసం కార్యాచరణ ప్రణాళిక చేపట్టాలని పిటిషన్ డిమాండ్ చేసింది. సరాన్ జిల్లా చప్రా ఏరియాలో కల్తీ మద్యం సేవించి పలువురు ఆస్పత్రి పాలయ్యారు. బుధవారం ఉదయం నుంచి వారిలో ఒక్కొక్కరుగా ప్రాణాలు కోల్పోతూ వచ్చారు. ఇవాళ మధ్యాహ్నానికి ఆ కల్తీ మద్యం మరణాల సంఖ్య 60కి చేరింది. ఇంకా కొందరి పరిస్థితి విషమంగా ఉండటంతో మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉందని అధికారులు చెబుతున్నారు.