'కావాలని అలా మాట్లాడలేదు'.. మహిళలకు బీహార్ సీఎం క్షమాపణలు
బీహార్ ముఖ్యమంత్రి నితీశ్ కుమార్ మహిళలకు క్షమాపణ చెప్పారు. అసెంబ్లీలో తన స్పీచ్ పై ఆయన బుధవారం మీడియా ముందు స్పందించారు.
By అంజి Published on 8 Nov 2023 8:03 AM GMT'కావాలని అలా మాట్లాడలేదు'.. మహిళలకు బీహార్ సీఎం క్షమాపణలు
బీహార్ అసెంబ్లీలో జనాభా నియంత్రణలో మహిళా విద్య పాత్రపై చేసిన బీహార్ సీఎం చేసిన విచిత్రమైన వ్యాఖ్యలు వివాదాస్పదంగా మారాయి. ఈ క్రమంలోనే ముఖ్యమంత్రి నితీష్ కుమార్ బుధవారం మహిళలకు క్షమాపణలు చెప్పి తన ప్రకటనను ఉపసంహరించుకున్నారు. ''నేను ఏదైనా మాట్లాడి ఉంటే మరియు దానిని సమాజంలోని ప్రతి వర్గం ఖండించినట్లయితే, నేను ఆ ప్రకటనకు క్షమాపణలు కోరుతున్నాను. దానిని ఉపసంహరించుకుంటాను. అటువంటి ప్రకటనను నేను ఖండించాలనుకుంటున్నాను'' అని కుమార్ బుధవారం పాట్నాలో మీడియా ప్రతినిధులతో మాట్లాడుతూ అన్నారు. ఎవరినీ కించపరచాలని అనుకోలేదని, సెక్స్ ఎడ్యుకేషన్ ప్రాముఖ్యతను చెప్పే క్రమంలో అలా మాట్లాడానని వివరించారు. ఏదేమైనా తన వ్యాఖ్యలతో బాధపడిన మహిళలకు క్షమాపణలు చెబుతున్నట్లు తెలిపారు.
నీతిష్ కుమార్ మంగళవారం తన బీహార్ జనాభా నియంత్రణ సిద్ధాంతాన్ని వివరిస్తూ, జనాభా నియంత్రణలో మహిళల విద్య రాష్ట్రానికి ఎలా సహాయపడిందో చెప్పారు. ఆయన వివరణ సభాకార్యక్రమాల సమయంలో మహిళా శాసనసభ్యులకు ఇబ్బందికర పరిస్థితిగా మారింది. 'షాదీకే బాద్ పురుష్ రోజ్ రాత్ కర్తేహేనా' అని అంటూ.. భార్య చదువుకున్నదైతే గర్భం రాకుండా శృంగారం చేయడం ఎలా అనేది ఆమెకు తెలుసునంటూ వ్యాఖ్యానించారు. శృంగారం అంతా సరిగానే జరిగినా చివర్లో బయటకు తీసేయాలి అనే విషయం చదువుకున్న మహిళలకు తెలుస్తుందని వ్యాఖ్యానించారు. నితీశ్ వ్యాఖ్యలకు పురుష ఎమ్మెల్యేలు ముసిముసిగా నవ్వుకుంటే.. మహిళా ఎమ్మెల్యేలు మాత్రం తీవ్ర ఇబ్బందిపడ్డారు. ఈ మాటలు చాలా షాకింగ్‌గా ఉన్నాయని పలువురు మహిళా శాసనసభ్యులు అన్నారు. ఆయన ప్రకటన తర్వాత ప్రతిపక్ష పార్టీల నేతలు - సామ్రాట్ చౌదరి, గిరిరాజ్ సింగ్, విజయ్ కుమార్ సిన్హా, నేవేదితా సింగ్, పలువురు ముఖ్యమంత్రిని తీవ్రంగా విమర్శించారు.
బీహార్ అసెంబ్లీలో నితీష్ కుమార్ అత్యంత అవమానకరమైన వ్యాఖ్య చేసిన తర్వాత, జాతీయ మహిళా కమిషన్ (NCW) దానిని ఖండించింది. వెంటనే అతనికి క్షమాపణ చెప్పాలని కోరింది. ఎన్‌సీడబ్ల్యూ చీఫ్ రేఖా శర్మ ఒక ప్రకటన విడుదల చేస్తూ.. ''ఈ దేశంలోని ప్రతి మహిళ తరపున, జాతీయ మహిళా కమిషన్ ఛైర్‌పర్సన్‌గా, నేను బీహార్ ముఖ్యమంత్రి నితీష్ నుండి తక్షణమే, నిర్ద్వంద్వంగా క్షమాపణలు చెప్పాలని డిమాండ్ చేస్తున్నాను. విధానసభలో ఆయన చేసిన విపరీతమైన వ్యాఖ్యలు ప్రతి మహిళకు దక్కాల్సిన పరువు, గౌరవానికి భంగం కలిగించేలా ఉన్నాయి. ఆయన ప్రసంగంలో ఇలాంటి అవమానకరమైన, చౌకబారు పదజాలం మన సమాజానికి చీకటి మరక. ప్రజాస్వామ్యంలో ఒక నాయకుడు ఇంత బహిరంగంగా ఇలాంటి వ్యాఖ్యలు చేయగలిగితే, ఆయన నాయకత్వంలో రాష్ట్రం చవిచూడాల్సిన ఘోరం ఊహించవచ్చు. మేము అటువంటి ప్రవర్తనకు వ్యతిరేకంగా గట్టిగా నిలబడతాము'' అని అన్నారు.
ఇదిలా ఉంటే.. అసెంబ్లీలో ముఖ్యమంత్రి నితీశ్ స్పీచ్ పై ప్రతిపక్ష బీజేపీ సభ్యులు అభ్యంతరం వ్యక్తం చేశారు. బుధవారం స్పీకర్ పోడియం వద్దకు వెళ్లి ఆందోళన చేశారు. నితీశ్ వెంటనే ముఖ్యమంత్రి పదవికి రాజీనామా చేయాలని వారు డిమాండ్ చేశారు. ప్రతిపక్ష సభ్యుల ఆందోళనపై నితీశ్ కుమార్ స్పందిస్తూ.. ప్రతిపక్ష ఎమ్మెల్యేల అభ్యంతరాలపై మీడియా ముందే వివరణ ఇచ్చినట్లు తెలిపారు.