జాతీయ రహదారి వినియోగదారులకు ప్రయోజనం చేకూర్చేలా మోదీ ప్రభుత్వం ఇప్పుడు ఏకరీతి టోల్ విధానాన్ని అమలు చేయనుందని కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ అన్నారు. కేంద్ర రోడ్డు రవాణా మరియు రహదారుల శాఖ మంత్రి గడ్కరీ మీడియాతో మాట్లాడుతూ.. వాహనదారులకు “త్వరలో” ఉపశమనం లభిస్తుందని అన్నారు. మా పరిశోధన పూర్తయింది.. ప్రణాళిక త్వరలో ఆవిష్కరించబడుతుంది అని ఆయన పేర్కొన్నారు. అయితే టోల్‌ను రద్దు చేస్తారా లేదా తగ్గిస్తారా అనే దానిపై గడ్కరీ స్పష్టత ఇవ్వలేదు. జాతీయ రహదారులపై అవరోధ రహిత గ్లోబల్ నావిగేషన్ శాటిలైట్ సిస్టమ్ (జిఎన్‌ఎస్‌ఎస్) ఆధారిత టోల్ వసూలు వ్యవస్థపై ప్రభుత్వం కృషి చేస్తోందని ఆయన తెలియజేశారు.
టోల్ వసూలుకు సంబంధించిన మీమ్స్‌పై నితిన్ గడ్కరీ ప్రతిస్పందించారు. సోషల్ మీడియాలో నన్ను చాలా మంది ట్రోల్ చేస్తున్నారు.. టోల్ చూసి జనాలు కాస్త కోపంగా ఉన్నారు.. ఈ కోపం మరికొద్ది రోజుల్లో తగ్గుతుందని చెప్పగలనన్నారు.
ప్రస్తుతం జాతీయ రహదారులపై ప్రైవేట్ కార్ల వాటా 60 శాతం ఉండగా, వాటి నుంచి వచ్చే టోల్ ఆదాయం 20-26 శాతం మధ్య ఉండటం గమనార్హం. భారతదేశం ప్రపంచంలో రెండవ అతిపెద్ద రోడ్ నెట్‌వర్క్‌ను కలిగి ఉంది.. జాతీయ రహదారుల మొత్తం పొడవు 1,46,195 కిలోమీటర్లు. 2023-24లో మొత్తం టోల్ వసూళ్లు రూ.64,809.86 కోట్లకు చేరాయి.. ఇది అంతకుముందు సంవత్సరంతో పోలిస్తే 35 శాతం పెరిగింది.
డిసెంబర్ 2024 లో లోక్‌సభలో గడ్కరీ మాట్లాడుతూ.. 2000 నుండి పబ్లిక్-ప్రైవేట్ పార్టనర్‌షిప్ (PPP) మోడల్‌లో నిర్వహించబడుతున్న టోల్ ప్లాజాల నుండి వినియోగదారు రుసుముగా సుమారు రూ. 1.44 లక్షల కోట్లు వసూలు చేసినట్లు తెలిపారు.