దేశవ్యాప్తంగా ఏకకాలంలో 72 ప్రాంతాల్లో ఎన్ఐఏ పోదాలు
NIA searches 75 spots in Delhi and 7 states. గ్యాంగ్‌స్టర్ టెర్రర్ ఫండింగ్ కేసులకు సంబంధించి నేషనల్ ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీ (NIA) బృందం
By M.S.R Published on 21 Feb 2023 2:15 PM GMTగ్యాంగ్‌స్టర్ టెర్రర్ ఫండింగ్ కేసులకు సంబంధించి నేషనల్ ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీ (NIA) బృందం దేశ వ్యాప్తంగా మంగళవారం ఉదయం సుమారు 72 ప్రాంతాల్లో ఏకకాలంలో తనిఖీలు నిర్వహిస్తోంది. పంజాబ్, హర్యానా, రాజస్థాన్, ఢిల్లీ, చండీగఢ్, యూపీ, గుజరాత్, మధ్యప్రదేశ్‌లో ఎన్‌ఐఏ అధికారులు ముమ్మర సోదాలు సాగిస్తున్నారు. ఉగ్రవాదులు, గ్యాంగ్‌స్టర్లు, డ్రగ్స్ స్మగ్లర్ల మధ్య సంబంధాల గురించి తెలుసుకోడానికి నేషనల్ ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీ పలు ప్రదేశాలపై దాడులు చేసింది. మొత్తం ఏడు రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతంలోని కొన్ని అనుమానిత ఇళ్లపై NIA బృందాలు దాడులు నిర్వహించాయి. దాదాపు డజను మంది అధికారులతో కూడిన ఎన్‌ఐఏ అధికారుల బృందం తెల్లవారుజామున 4 గంటల ప్రాంతంలో పలు ప్రాంతాలకు వెళ్లింది. అక్రమ ఆయుధాల వ్యాపారులు, గ్యాంగ్‌స్టర్ల ఇళ్లలో సోదాలు చేస్తున్నారు. అనేక మంది ఇళ్లలో అక్రమంగా ఆయుధాలు ఉన్నాయన్న సమాచారంతో ఈ దాడులు నిర్వహిస్తున్నట్లు తెలిసింది.
ఫిలిబిత్ కేంద్రంగా అక్రమంగా ఆయుధాలను గ్యాంగ్‌స్టర్లు, ఉగ్రవాదులకు సరఫరా చేస్తున్నారని ఎన్ఐఏ సోదాల్లో తేలింది. అక్రమ ఆయుధాలు పాకిస్థాన్ దేశం నుంచి వచ్చాయని ఎన్ఐఏ అధికారులు వెల్లడించారు. గ్యాంగ్‌స్టర్లు లారెన్స్ బిష్ణోయ్, నీరజ్ బవానాలకు చెందిన ముఠా సభ్యుల నుంచి అక్రమ ఆయుధాలను స్వాధీనం చేసుకున్న ఎన్ఐఏ అధికారులు వారిని ప్రశ్నిస్తున్నారు. "పంజాబ్, హర్యానా, ఢిల్లీ, ఉత్తరప్రదేశ్, రాజస్థాన్, గుజరాత్, మధ్యప్రదేశ్, మహారాష్ట్రలోని పలు ప్రాంతాల్లో ఎన్‌ఐఏ నమోదు చేసిన మూడు కేసులకు సంబంధించి సోదాలు కొనసాగుతున్నాయి" అని ఎన్‌ఐఏ అధికార ప్రతినిధి తెలిపారు.