ఆయన పరిస్థితి మెరుగ్గా ఉంది.. సీతారాం ఏచూరి ఆరోగ్యంపై సీపీఎం ప్రకటన
Condition of Sitaram Yechury improving CPI (M)
By Medi Samrat
సీపీఎం ప్రధాన కార్యదర్శి సీతారాం ఏచూరి అనారోగ్యంతో బాధపడుతూ ఢిల్లీలోని ఎయిమ్స్‌లో చేరారు. ఆయనను సోమవారం సాయంత్రం ఆసుపత్రిలోని అత్యవసర విభాగంలో చేర్చారు. తరువాత ఇంటెన్సివ్ కేర్ యూనిట్ (ఐసియూ)కి తరలించారు. సీతారాం ఏచూరి మొదట్లో చెకప్ కోసం వెళ్లారని.. ఆ తర్వాత న్యుమోనియాతో అడ్మిట్ అయ్యారని వార్తా సంస్థ పిటిఐ వార్తా సంస్థలను ఉటంకిస్తూ నివేదించింది. ఆయన చికిత్స పొందుతున్నారని.. పరిస్థితి నిలకడగా ఉందని వెల్లడించింది. తీవ్రమైన సమస్య ఏమీ లేదు.. ఆయన న్యుమోనియా కారణంగా అడ్మిట్ అయ్యారని అని పేర్కొంది. ఆయనకు ఇటీవల కంటిశుక్లం శస్త్రచికిత్స జరిగింది.
సీతారాం ఏచూరి అనారోగ్యంపై పార్టీ స్పందించింది. ఎయిమ్స్‌లో చికిత్స పొందుతున్న తమ నాయకుడు సీతారాం ఏచూరి ఆరోగ్య పరిస్థితి మెరుగ్గా ఉందని మంగళవారం తెలిపింది. "భారత కమ్యూనిస్ట్ పార్టీ (మార్క్సిస్ట్) ప్రధాన కార్యదర్శి కామ్రేడ్ సీతారాం ఏచూరి ఛాతీలో ఇన్ఫెక్షన్ కారణంగా నిన్న సాయంత్రం (ఆగస్టు 19) న్యూ ఢిల్లీలోని ఆల్ ఇండియా ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్‌లో చేరారు. ఆయన చికిత్స పొందుతున్నారని.. ఆయన పరిస్థితి మెరుగ్గా ఉందని సీపీఐ(ఎం) మంగళవారం ఒక ప్రకటనలో తెలిపింది.