మహిళల టీ20 ప్రపంచకప్‌లో ఈసారి కొత్త ఛాంపియన్‌ను చూడబోతున్నాం..!
మహిళల టీ20 ప్రపంచకప్‌లో ఈసారి రెండు కొత్త జట్లు ఫైనల్స్‌కు చేరుకోగా.. ఈ ఏడాది టోర్నీలో కొత్త ఛాంపియన్‌ను చూడనున్నాం.
By Kalasani Durgapraveen Published on 19 Oct 2024 1:06 AM GMTమహిళల టీ20 ప్రపంచకప్‌లో ఈసారి రెండు కొత్త జట్లు ఫైనల్స్‌కు చేరుకోగా.. ఈ ఏడాది టోర్నీలో కొత్త ఛాంపియన్‌ను చూడనున్నాం. దక్షిణాఫ్రికా 6 సార్లు ఛాంపియన్ ఆస్ట్రేలియాను ఓడించి ఫైనల్స్‌కు చేరుకోగా.. న్యూజిలాండ్ 14 సంవత్సరాల తర్వాత అక్టోబర్ 18 శుక్రవారం వెస్టిండీస్‌ను 8 పరుగులతో ఓడించి ఫైనల్స్‌లోకి ప్రవేశించింది. న్యూజిలాండ్ చివరిసారిగా 2009, 2010లో మహిళల టీ20 ప్రపంచకప్‌లో ఫైనల్‌కు చేరుకుంది. రెండు సార్లు కివీ జట్టు రన్నరప్‌గా నిలిచింది. న్యూజిలాండ్ ఇప్పుడు ఫైనల్‌లో లారా వోల్వార్డ్ నేతృత్వంలోని దక్షిణాఫ్రికాతో తలపడనుంది. 2016 సెమీ ఫైనల్స్‌లో న్యూజిలాండ్ వెస్టిండీస్‌తో తలపడింది. అప్పుడు వెస్టిండీస్ న్యూజిలాండ్ ను 6 పరుగుల తేడాతో ఓడించింది. ఆ ఓటమిపై ఇప్పుడు కివీస్ జట్టు ప్రతీకారం తీర్చుకుంది.
రెండో సెమీఫైనల్ మ్యాచ్ గురించి మాట్లాడుకుంటే.. తొలుత టాస్ గెలిచిన న్యూజిలాండ్ కెప్టెన్ బ్యాటింగ్ ఎంచుకుంది. న్యూజిలాండ్ 8 వికెట్ల నష్టానికి 128 పరుగులు చేసింది. సుజీ బేట్స్, జార్జియా తొలి వికెట్‌కు 48 పరుగులు జోడించారు. జార్జియా 33 పరుగులు, బేట్స్ 26 పరుగులు చేసి ఔటయ్యారు. ఆ తర్వాత వికెట్లు వరుసగా పడ్డాయి. చివర్లో ఇసాబెల్లా గేజ్ అజేయంగా 20 పరుగులు చేసింది. డియాండ్రా డాటిన్ 4 ఓవర్లలో 22 పరుగులిచ్చి నాలుగు వికెట్లు పడగొట్టింది.
అనంతరం లక్ష్యాన్ని ఛేదించే క్రమంలో వెస్టిండీస్‌కు 16 పరుగుల వద్ద తొలి దెబ్బ తగిలింది. దీని తర్వాత న్యూజిలాండ్ బౌలర్లు క్రమశిక్షణతో బౌలింగ్ చేస్తూ వెస్టిండీస్‌పై ఒత్తిడి పెంచారు. కెప్టెన్ హేలీ మాథ్యూస్ (15) వికెట్ పతనం తర్వాత మరింత ఒత్తిడి ఏర్పడింది. బౌలింగ్‌లో రాణించిన డియాండ్రా (33) బ్యాటింగ్‌లోనూ కూడా తన ప్రతిభను చాటుకుంది. న్యూజిలాండ్ బౌలర్లను ధైర్యంగా ఎదుర్కొన్న ఏకైక బ్యాట్స్‌మెన్ ఆమె. అయితే, అమేలియా కెర్ తన వికెట్ తీయడం ద్వారా న్యూజిలాండ్ కు మంచి బ్రేక్‌ను ఇచ్చింది. న్యూజిలాండ్ తరఫున ఈడెన్ కార్సన్ మూడు వికెట్లు.. కెర్ రెండు వికెట్లు తీసి జట్టును 8 పరుగుల తేడాతో గెలిపించారు.