కొత్త పార్లమెంటు.. 2022 కల్లా రెడీ అవుతుందా..?
New Parliament building Bhoomi pujan on December 10. ఈ నెల 10న కొత్త పార్లమెంటు భవనం నిర్మాణానికి భూమి పూజ చేయనున్నారు
By Medi Samrat Published on 6 Dec 2020 6:53 PM ISTఈ నెల 10న కొత్త పార్లమెంటు భవనం నిర్మాణానికి భూమి పూజ చేయనున్నారు ప్రధాని నరేంద్ర మోదీ. కొత్త పార్లమెంటు భవనం త్రిభుజాకారంలో ఉండబోతోంది. ప్రస్తుత పార్లమెంటు భవనం పక్కనే దీన్ని నిర్మించనున్నారు. టాటా ప్రాజెక్ట్స్ లిమిటెడ్ ఈ భవనాన్ని నిర్మించబోతోంది. రూ. 861.90 కోట్ల వ్యయంతో దీన్ని నిర్మిస్తున్నారు. ప్రస్తుతం ఉన్న పార్లమెంటు భవనాన్ని బ్రిటీష్ హయాంలో నిర్మించారు. ఎడ్విన్ లూట్యెన్స్, హర్బర్ట్ బేకర్ ల పర్యవేక్షణలో దీని నిర్మాణం జరిగింది. పాతబడిపోవడంతో.. కొత్త భవనాన్ని నిర్మించాల్సిన అవసరం ఉందని ఈ ఏడాది ప్రారంభంలో కేంద్ర ప్రభుత్వం కొత్త పార్లమెంట్ భవనానికి సంబంధించిన నిర్ణయాన్ని తీసుకుంది.
కొత్త పార్లమెంట్ కు నరేంద్ర మోదీ డిసెంబర్ 10న భూమి పూజ చేయనున్నారు. భూకంపాలను సైతం తట్టుకునేలా అత్యాధునిక టెక్నాలజీతో దీన్ని నిర్మించనున్నారు. ఈ నిర్మాణం వల్ల ప్రత్యక్షంగా 2 వేల మంది, పరోక్షంగా 9 వేల మంది ఉపాధిని పొందబోతున్నారు. 1200 మంది ఎంపీలకు సరిపడేలా భవనం ఉంటుందని ఓం బిర్లా తెలిపారు. కొత్త పార్లమెంటు భవనంలో ప్రజాస్వామ్య వారసత్వాన్ని ప్రతిబింబించేలా కాన్స్టిట్యూషన్ హాల్ ఉండనుంది. ఎంపీల లాంజ్, లైబ్రరీ, పెద్ద సంఖ్యలో కమిటీ గదులు, డైనింగ్ ఏరియాలతో పాటు సువిశాల పార్కింగ్ ఉండనుంది. 2022లో మన దేశం 75వ స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలను జరుపుకునే సమయంలో ఈ కొత్త భవనంలో పార్లమెంటు సమావేశాలు జరుగుతాయని అంచనా వేస్తున్నారు.