ఢిల్లీ: పాకిస్థాన్, బంగ్లాదేశ్, ఆఫ్ఘనిస్థాన్ దేశాల నుంచి భారత్‌కు వలస వచ్చిన మైనారిటీ వర్గాలకు కేంద్ర ప్రభుత్వం భారీ ఊరట కల్పించింది. సరైన ప్రయాణ పత్రాలు లేకపోయినా, వాటి గడువు ముగిసినా శిక్షల నుంచి మినహాయింపు ఇస్తూ కీలక ఉత్తర్వులు జారీ చేసింది. ఈ మేరకు '2025 ఇమ్మిగ్రేషన్, ఫారినర్స్ చట్టం' సోమవారం నుంచి అమల్లోకి వచ్చింది. ఈ కొత్త నిబంధనల ప్రకారం, 2024 డిసెంబర్ 31వ తేదీకి ముందు భారత్లోకి ప్రవేశించిన హిందూ, సిక్కు, బౌద్ధ, జైన, పార్శీ, క్రైస్తవ మతాలకు చెందిన వలసదారులకు ఈ మినహాయింపు వర్తిస్తుంది.
చెల్లుబాటయ్యే పాస్‌పోర్ట్ లేదా వీసా లేకుండా దేశంలోకి ప్రవేశించినా, లేదా వాటి గడువు ముగిసిపోయినా వారిపై చట్టపరమైన చర్యలు తీసుకోరు. సాధారణంగా ఇలాంటి కేసులలో ఐదేళ్ల వరకు జైలు శిక్ష లేదా రూ.5 లక్షల జరిమానా విధించే అవకాశం ఉంది. ఇదే తరహా మినహాయింపును టిబెటన్లు, శ్రీలంక తమిళులకు కూడా పొడిగించారు. నిర్దిష్ట కాలపరిమితిలోగా భారత్‌కు వచ్చిన వారికి ఈ వెసులుబాటు ఉంటుంది. అయితే, నేపాల్, భూటాన్ పౌరులు చైనా, పాకిస్థాన్ వంటి దేశాల మీదుగా ప్రయాణిస్తే మాత్రం ఈ మినహాయింపులు వర్తించవని ప్రభుత్వం స్పష్టం చేసింది. మరోవైపు, మినహాయింపు పరిధిలోకి రాని విదేశీయులకు కఠిన నిబంధనలు విధించారు.