ఢిల్లీ: దేశంలోని అతిపెద్ద విమానయాన సంస్థ ఇండిగోను చుట్టుముట్టిన భారీ సంక్షోభం కొనసాగుతుండగా, ఈ పరిస్థితికి దారితీసిన సంఘటనల వరుసపై కొత్త వివరాలు వెలుగులోకి వస్తున్నాయి. రాజకీయ–భద్రతా నేపథ్యం, అంతర్జాతీయ సంబంధాలు, నియంత్రణ సంస్థల హెచ్చరికలు, అంతర్గత సంస్థాగత వైఫల్యాలు—ఇవన్నీ కలసి జరిగిన ఈ విపరీత అంతరాయం దేశవ్యాప్తంగా లక్షలాది ప్రయాణికులను తీవ్ర ఆందోళనకు గురిచేశాయి.
మే 2025లో కీలక పరిణామం: సెలెబి ఏవియేషన్ అనుమతి రద్దు
భారత ప్రభుత్వం మే 2025లో టర్కీకి చెందిన గ్రౌండ్-హాండ్లింగ్ సంస్థ Celebi Aviationకు ఇచ్చిన భద్రతా క్లియరెన్స్‌ను రద్దు చేసింది. టర్కీ–పాకిస్తాన్ సాన్నిహిత్యం, కాశ్మీర్ వివాదంలో టర్కీ తీసుకున్న వైఖరి నేపథ్యంలో ఈ నిర్ణయం ప్రాధాన్యం సంతరించుకుంది.
టర్కిష్ ఎయిర్‌లైన్స్‌తో ఇండిగో సంబంధాలు వివాదంలో..
ఇండిగోకు టర్కిష్ ఎయిర్‌లైన్స్‌తో బలమైన కోడ్‌షేర్, ఆపరేషనల్ భాగస్వామ్యాలు ఉన్నాయి. వీటిని తగ్గించాలని భారత ప్రభుత్వం పలుమార్లు సూచించినప్పటికీ, ఇండిగో పొడిగింపు కోరుతూ వచ్చింది. చివరి పొడిగింపు 31 ఆగస్టు 2025న ముగిసింది. సన్నిహిత వర్గాల ప్రకారం, ఈ సంబంధాలపై ప్రభుత్వం ఆందోళనలు వ్యక్తం చేసినట్లు తెలుస్తోంది.