ప్రస్తుతం కాంగ్రెస్ పార్టీ పరిస్థితి ఎంత ఘోరంగా ఉందో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. కాంగ్రెస్ పార్టీకి పూర్వ వైభవం తీసుకుని వచ్చే నాయకుడి కోసం పార్టీ అధిష్టానం ఎదురుచూస్తూ ఉంది. ఎప్పుడు కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడిని ఎన్నుకుంటారా అనే ఉత్సుకత కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలలో కనిపిస్తోంది. అందుకు తగ్గ ముహూర్తాన్ని కాంగ్రెస్ పార్టీ అధినాయకత్వం ఫిక్స్ చేసింది. మే 29న అధ్యక్ష పదవికి ఎన్నికలు నిర్వహించేందుకు సన్నాహకాలు చేస్తున్నారు.
ఢిల్లీలో జరిగిన కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ సమావేశంలో పార్టీ సెంట్రల్ ఎలక్షన్ అథారిటీ దీనికి సంబంధించి ప్రతిపాదనలను చేసింది.
సోనియాగాంధీ మాట్లాడుతూ జాతీయ భద్రతపై రాజీపడటం దారుణమని కేంద్ర ప్రభుత్వంపై విమర్శలు గుప్పించారు. బాలాకోట్ పై ఎయిర్ స్ట్రయిక్స్ చేయడానికి మూడు రోజుల ముందే రిపబ్లిక్ టీవీ అర్నాబ్ గోస్వామి మరొకరితో జరిపిన వాట్సాప్ సందేశాలలో ఈ దాడుల అంశం గురించి మాట్లాడారు అని ఆరోపించారు. సైనిక రహస్యాలు బయటకు రావడం రాజద్రోహం కిందకు వస్తుందని.. ఈ వ్యవహారంపై కేంద్ర ప్రభుత్వం నోరు మెదపకుండా మౌనంగా ఉందని మండిపడ్డారు. ఎప్పుడూ దేశభక్తి, జాతీయవాదం గురించి మాట్లాడే వారి అసలైన వైఖరి ఏమిటో ఇప్పుడు బయటపడిందని చెప్పుకొచ్చారు.