మహాత్మ గాంధీపై స్వాతంత్ర్య సమరయోధుడు, ఐఎన్‌ఏ స్థాపకుడు నేతాజీ సుభాష్ చంద్రబోస్ కుమార్తె అనితా బోస్ సంచలన వ్యాఖ్యలు చేశారు. ' నా తండ్రికి మహాత్మా గాంధీకి మధ్య సరైన సత్సంబంధాలు లేవని, ఎందుకంటే తాను నేతాజీని నియంత్రించలేనని గాంధీ భావించారని' అన్నారు. కానీ మా నాన్న గాంధీకి గొప్ప ఆరాధకుడు అని అనితా బోస్ ఫాఫ్ చెప్పారు. మహాత్మా గాంధీ, జవహర్‌లాల్ నెహ్రూలు కలిసి నేతాజీని బ్రిటిష్ వారికి అప్పగించేందుకు సిద్ధంగా ఉన్నారని నటి కంగనా రనౌత్ చేసిన వ్యాఖ్యపై ఓ దినపత్రిక అడిగిన ప్రశ్నకు సమాధానంగా ఆమె ఈ వ్యాఖ్యలు చేశారు.
అయితే చరిత్రలో కూడా వారి మధ్య సఖ్యతతో సంబంధాలు లేవన్న సంగతి తెలిసిందే. అనిత మాట్లాడుతూ.. "వారిద్దరూ (నేతాజీ, గాంధీ) భారతదేశ స్వాతంత్ర్యం కోసం పోరాడిన గొప్ప వీరులు. ఒకరు లేకుండా మరోకరు లేరు. ఇది ఇద్దరి కలయిక. భారతదేశ స్వాతంత్య్రానికి అహింసా విధానం మాత్రమే కారణమని కొంతమంది కాంగ్రెస్ సభ్యులు చాలా కాలంగా వాదించడానికి ప్రయత్నిస్తున్నారు. ఇది వాస్తవం కాదు. నేతాజీ, ఇండియన్ నేషనల్ ఆర్మీ చర్యలు కూడా భారతదేశ స్వాతంత్య్రానికి దోహదపడ్డాయని మనందరికీ తెలుసు" అని అన్నారు.
నేతాజీ, ఐఎన్‌ఎ మాత్రమే భారతదేశానికి స్వాతంత్య్రం తెచ్చిందని చెప్పుకోవడం అర్ధంలేనిదని అన్నారు. నేతాజీతో సహా చాలా మందికి గాంధీ స్ఫూర్తినిచ్చారని ఆమె తెలిపారు. సుభాష్ చంద్రబోస్, భగత్ సింగ్‌లకు మహాత్మా గాంధీ నుండి ఎటువంటి మద్దతు లభించలేదని కంగనా రనౌత్ మంగళవారం ఇన్‌స్టాగ్రామ్ లో పేర్కొన్నారు. 2014లో నరేంద్ర మోడీ నేతృత్వంలోని ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పుడు స్వాతంత్ర్యం వచ్చిందని ప్రకటించారు. స్వాతంత్ర్యం 2014లో మాత్రమే లభించిందని, 1947లో కాదని కంగనా చేసిన ప్రకటనపై ప్రశ్నించినప్పుడు స్వాతంత్య్రాన్ని ఏకపక్షంగా చూడడం అమాయకమని అనితా బోస్ అన్నారు.