బీజేపీని వీడిన సుభాష్ చంద్రబోస్ ముని మనవడు
స్వాతంత్ర్య సమరయోధుడు నేతాజీ సుభాష్ చంద్రబోస్ ముని మనవడు చంద్రబోస్ భారతీయ జనతా పార్టీని వీడాడు.
By Medi Samrat Published on 6 Sep 2023 3:47 PM GMTస్వాతంత్ర్య సమరయోధుడు నేతాజీ సుభాష్ చంద్రబోస్ ముని మనవడు చంద్రబోస్ భారతీయ జనతా పార్టీని వీడాడు. 2016 లో చేరి బెంగాల్ అసెంబ్లీ, లోక్ సభ ఎన్నికల్లో చంద్రబోస్ పోటీ చేశారు. భారతీయ జనతా పార్టీలో తాను చేరిన లక్ష్యం నెరవేరలేదని.. అందుకు పార్టీ సహకరించలేదని విమర్శలు గుప్పించారు. నేతాజీ సుభాష్ చంద్రబోస్ లక్ష్యాలను ముందుకు తీసుకెళ్లేందుకు తాను పార్టీలో చేరానని, అయితే తనకు అలాంటి సహకారం అందలేదని అన్నారు. జాతీయవాద నేత అయిన నేతాజీ దార్శనికతను ముందుకు తీసుకెళ్లడంలో బీజేపీ తనకు సహకరించలేదని చంద్రబోస్ ఆవేదన వ్యక్తం చేశారు.
2016 లో పశ్చిమ బెంగాల్ బీజేపీ ఉపాధ్యక్షుడిగా నియమితులైన చంద్రబోస్‌ను 2020లో చేపట్టిన పార్టీ సంస్థాగత మార్పుల్లో ఆయనను ఆ పదవి నుంచి తొలగించారు. నేతాజీ సుభాష్ చంద్రబోస్.. ఆయన సోదరుడు శరత్ చంద్రబోస్‌ల భావజలాన్ని ప్రజల్లోకి తీసుకుకెళ్లేందుకు తాను అప్పట్లో బీజేపీతో చర్చలు జరిపినట్లు బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డాకు రాసిన రాజీనామా లేఖలో చంద్రబోస్ వివరించారు. తాను నిర్దేశించుకున్న ఆ లక్ష్యాలను చేరుకునేందుకు తాను చేపట్టిన కార్యక్రమాల్లో బీజేపీ నుంచి ఎలాంటి సపోర్ట్ అందలేదని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రజలకు చేరువ అయ్యేందుకు తాను సమగ్ర బెంగాల్ స్ట్రాటజీని బీజేపీ ముందు ఉంచానని, అయినప్పటికీ తన ప్రతిపాదనలను బీజేపీ విస్మరించిందని ఆరోపించారు.