ఉద్ధవ్ థాకరేకు సవాల్ విసిరిన నవనీత్ రాణా
Navneet Rana Challenges Maha CM. ముంబైలోని లీలావతి ఆసుపత్రిలో చేరిన అమరావతి ఎంపీ నవనీత్ రాణా డిశ్చార్జ్ అయ్యారు.
By Medi Samrat Published on 8 May 2022 3:30 PM GMTముంబైలోని లీలావతి ఆసుపత్రిలో చేరిన అమరావతి ఎంపీ నవనీత్ రాణా డిశ్చార్జ్ అయ్యారు. ఇటీవల ఆమె బైకుల్లా జైలు నుండి విడుదలైన తర్వాత ఆసుపత్రిలో చేరారు. ఆమెకు స్పాండిలోసిస్ ఉంది. జైలులో నేలపై కూర్చోవడం, పడుకోవడం వల్ల పెరిగింది. మహారాష్ట్ర ముఖ్యమంత్రి ఇంటి వెలుపల హనుమాన్ చాలీసాను పఠించడానికి ప్రయత్నించినందుకు దేశద్రోహ నేరం కింద ఆమె, ఆమె భర్త ఎమ్మెల్యే రవి రాణాను అరెస్టు చేశారు. మే 5, గురువారం విడుదల చేసిన వెంటనే నవనీత్ రాణాను ఆసుపత్రికి తరలించారు.
ఆసుపత్రి నుండి విడుదలయ్యాక ఆమె శివసేన అధినేత, మహారాష్ట్ర ముఖ్యమంత్రి ఉద్ధవ్ థాకరే కు సవాల్ విసిరారు. దమ్ముంటే తనపై పోటీ చేసి గెలవాలని ఆమె కోరారు. రాష్ట్రంలో ఏ నియోజకవర్గం నుంచైనా పోటీ చేసినా పర్వాలేదన్నారు. మహిళా శక్తి అంటే ఏంటో థాకరేకు చూపిస్తామని నవ్‌నీత్ రాణా అన్నారు. తాను ఏ తప్పు చేశానని జైళ్లో పెట్టారని ఆమె ప్రశ్నించారు. హనుమాన్ చాలీసా చదవడం తప్పా అని ఆమె నిలదీశారు. హనుమాన్ చాలీసా చదవడం నేరమైతే 14 రోజులు కాదు 14 సంవత్సరాలైనా జైలుకెళ్లేందుకు సిద్ధమని తెలిపారు. తన ప్రస్తుత ఆరోగ్య పరిస్థితి వివరాలను తెలియజేస్తూ.. నా వెన్ను గాయం పెద్ద సమస్యగా మారింది. ఈ రోజు నన్ను డిశ్చార్జ్ చేయమని డాక్టర్‌ని అభ్యర్థించాను.. అందుకు డాక్టర్లు ఒప్పుకోలేదని.. ఇంకొన్ని రోజులు వైద్యుల పర్యవేక్షణలో ఉండాలని సూచించారని ఆమె తెలిపారు.