పాటియాలా కోర్టులో లొంగిపోయిన సిద్ధూ
Navjot Singh Sidhu surrenders in court. 1988 రోడ్డుపై గొడవ కేసులో మాజీ క్రికెటర్-రాజకీయవేత్త నవజ్యోత్ సింగ్ సిద్ధూకి సుప్రీంకోర్టు ఏడాది జైలు శిక్ష
By Medi Samrat Published on 20 May 2022 7:15 PM IST
1988 రోడ్డుపై గొడవ కేసులో మాజీ క్రికెటర్-రాజకీయవేత్త నవజ్యోత్ సింగ్ సిద్ధూకి సుప్రీంకోర్టు ఏడాది జైలు శిక్ష విధించిన ఒక రోజు తర్వాత, సిద్ధూ పాటియాలా కోర్టులో లొంగిపోయారు. 34 ఏళ్ల నాటి కేసులో పాటియాలా నివాసి గుర్నామ్ సింగ్ మరణించడానికి పంజాబ్ కాంగ్రెస్ మాజీ అధ్యక్షుడు నవజ్యోత్ సింగ్ సిద్ధూను నిర్దోషిగా పేర్కొంటూ.. మే 2018లో ఇచ్చిన ఉత్తర్వులను సమీక్షించేందుకు సుప్రీంకోర్టు గతంలో అనుమతించింది. గతంలో సిద్ధూను రూ. 1,000 జరిమానాతో విడిచిపెట్టారు. ఇప్పుడు, IPC సెక్షన్ 323 కింద గరిష్ట శిక్ష సిద్ధూకి విధించబడింది.
1988లో రోడ్డుపై గొడవ పడిన ఘటనలో గుర్నామ్ సింగ్ అనే వ్యక్తిని సిద్ధూ కొట్టారు. ఆయన కొట్టిన దెబ్బలు గుర్నామ్ తలకు బలంగా తగలడంతో ఆయన చనిపోయారనే కేసులోనే సిద్ధూకు సుప్రీంకోర్టు శిక్షను విధించింది. మొదట తాను లొంగిపోవడానికి కొన్ని వారాల సమయాన్ని ఇవ్వాలని సుప్రీంకోర్టును సిద్ధూ కోరారు. తనకు ఆరోగ్యం బాగోలేదని, ఈ కారణం వల్ల తనకు కొన్ని వారాల సమయాన్ని ఇవ్వాలని కోర్టుకు విన్నవించారు. సిద్ధూ తరపున సీనియర్ న్యాయవాది అభిషేక్ మను సింఘ్వి కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు.
క్రైమ్ జరిగి ఇప్పటికే 34 ఏళ్లు గడిచిపోయాయని.. సుప్రీంకోర్టు శిక్షను విధించడం కూడా జరిగిందని... ఇప్పుడు కూడా ఇంకా కొన్ని వారాల సమయం కావాలని అడగడం సరికాదని పంజాబ్ ప్రభుత్వ న్యాయవాది అభ్యంతరం వ్యక్తం చేశారు. సింఘ్వీ తన వాదలను వినిపిస్తూ.. తన క్లయింట్ లొంగిపోతాననే చెపుతున్నారని, కేవలం కొంత సమయాన్ని మాత్రమే అడుగుతున్నారని కోర్టుకు తెలిపారు. అయితే సాయంత్రానికల్లా సిద్ధూ లొంగిపోయారు.