నాగ్‌పూర్ హింసాకాండలో నిందితుల్లో ఒకరు విధుల్లో ఉన్న మహిళా పోలీసు అధికారిని లైంగికంగా వేధించాడని, గణేష్‌పేట్ పోలీస్ స్టేషన్‌లో నమోదైన ఎఫ్‌ఐఆర్‌లో వెల్లడైంది. ఎఫ్‌ఐఆర్ ప్రకారం, నిందితుడు మహిళా పోలీసు యూనిఫాం, శరీరాన్ని పలు చోట్ల తాకాడు, అసభ్యకరమైన సైగలు చేశాడు. ఆర్‌సిపి స్క్వాడ్ అధికారితో దురుసుగా ప్రవర్తించాడు. చీకటిలో ఆ గుంపు అల్లర్ల నియంత్రణ విధుల్లో ఉన్న పోలీసు మహిళా కానిస్టేబుల్‌ను తాకడానికి ప్రయత్నించారని పోలీసులు తెలిపారు. ఆమె దుస్తులు విప్పడానికి కూడా ప్రయత్నించారు. ఇతర మహిళా పోలీసు సిబ్బందిపై కూడా అసభ్యకరమైన వ్యాఖ్యలు చేశారని పోలీసులు తెలిపారు.
హింస చోటు చేసుకున్న సమయంలో అతడితో పాటూ వచ్చిన గుంపు పోలీసులపై బాంబులు కూడా విసిరింది. "హింసకు సంబంధించి నాగ్‌పూర్‌లో మొత్తం ఐదు ఎఫ్‌ఐఆర్‌లు నమోదయ్యాయి. గణేష్‌పేట్ పోలీస్ స్టేషన్‌లో నమోదైన ఎఫ్‌ఐఆర్‌లలో ఒకటి, నగరంలోని భల్దార్‌పురా చౌక్ వద్ద ఒక గుంపు గుమిగూడి పోలీసు సిబ్బందిపై దాడి చేశారని చెబుతోంది. జనం పోలీసు సిబ్బందిపై పెట్రోల్ బాంబులు, రాళ్లను కూడా విసిరారు" అని ఒక అధికారి తెలిపారు.