కేరళలోని కొండచరియలు విరిగిపడిన వాయనాడ్ జిల్లాలోని ఎడక్కల్ ప్రాంతంలోని ప్రజలు భయం గుప్పిట బతుకుతున్నారు. తమకు వింత వింత శబ్దాలు వినపడుతూ ఉన్నాయని చెబుతున్నారు. శుక్రవారం నాడు భూమి కింద నుండి శబ్దం వినిపించిందని ఫిర్యాదు చేశారు. స్థానిక నివాసితులు విలేకరులతో మాట్లాడుతూ.. భారీ శబ్దం వినిపించిందని, దానితో పాటు కుదుపు లాంటి సంచలనం కలిగిందని ప్రజలు తెలిపారు. దీనిపై ప్రభుత్వ అధికారులు దర్యాప్తు చేయాలని డిమాండ్ చేశారు.
కేరళ స్టేట్ డిజాస్టర్ మేనేజ్‌మెంట్ అథారిటీ (కెఎస్‌డిఎంఎ) భూకంపానికి సంబంధించిన రికార్డులను పరిశీలిస్తోందని, ఏదైనా అసాధారణంగా ఉందో లేదో తెలుసుకోవడానికి స్థానిక సంస్థల సహాయం తీసుకుంటున్నట్లు అధికారులు తెలిపారు. ఇప్పటి వరకు భూకంపానికి సంబంధించిన కదలికల సంకేతాలు ఏవీ లేవని తెలిపారు. ఓ టీవీ న్యూస్ ఛానెల్‌తో మాట్లాడిన పంచాయతీ వార్డు సభ్యుడు తెలిపిన వివరాల ప్రకారం ఉదయం 10.15 గంటల ప్రాంతంలో శబ్దం వినిపించిందని తెలిపారు. ప్రభావిత ప్రాంతంలోని పాఠశాలలకు సెలవు ప్రకటించినట్లు అధికారులు తెలిపారు.