మహారాష్ట్రలోని థానే జిల్లాలోని సెషన్స్ కోర్టులో విచారణ సందర్భంగా హత్య కేసులో నిందితుడైన 22 ఏళ్ల వ్యక్తి జడ్జిపైకి చెప్పు విసిరాడు. ఈ ఘటనపై సోమవారం పోలీసులు సమాచారం అందించారు. అయితే.. స్లిప్పర్ జడ్జికి తగలలేదని, జడ్జి డెస్క్ ముందు ఉన్న చెక్క ఫ్రేమ్‌కు తగిలి కోర్టు క్లర్క్ దగ్గర పడిపోయిందని తెలిపారు.
నిందితుడు కిరణ్ సంతోష్ భరమ్‌పై హత్య కేసులో విచారణ నిమిత్తం జిల్లా, అదనపు సెషన్స్ జడ్జి ఆర్‌జి వాఘమారే ఎదుట హాజరుపరిచినట్లు మహాత్మ ఫూలే పోలీస్ స్టేషన్ అధికారి తెలిపారు. ఆ సమయంలో నిందితుడు తన కేసును వేరే కోర్టుకు బదిలీ చేయాలని న్యాయమూర్తిని అభ్యర్థించగా.. తన లాయర్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలని నిందితుడికి న్యాయమూర్తి సూచించారు.
దీని తర్వాత.. నిందితుడి లాయర్ పేరు పిలవగా.. అతను హాజరుకాలేదు.. నిందితుడిని తరపున వాదించడానికి మరొక న్యాయవాదిని ఎంచుకోవాలని చెబుతూ.. కోర్టు విచారణకు కొత్త తేదీని ప్రకటించింది. దీంతో నిందితుడు కిందకు వంగి.. తన చెప్పు తీసి న్యాయమూర్తి వైపు విసిరి.. కోర్టులో ఉన్నవారందరినీ ఆశ్చర్యపరిచాడని అధికారి తెలిపారు. దీంతో నిందితుడిపై భారతీయ న్యాయ కోడ్ సెక్షన్ 132 (ప్రభుత్వ సేవకుడు విధులను నిర్వర్తించకుండా నిరోధించడానికి దాడి), సెక్షన్ 125 (ఇతరుల జీవితానికి లేదా వ్యక్తిగత భద్రతకు హాని కలిగించడం) కింద కేసు నమోదు చేసినట్లు పోలీసులు తెలిపారు.