జమ్మూకశ్మీర్‌లో మున్సిపల్ కౌన్సిలర్‌ను, ఆయన వ్యక్తిగత అంగరక్షకుడిని కాల్చి చంపారు. బారాముల్లా జిల్లాలోని సోపోరు పట్టణంలో సోమవారం ఈ దారుణం జరిగింది. మధ్యాహ్నం సోపోరు మున్సిపల్ కౌన్సిల్ సమావేశం జరుగుతుండగా గుర్తుతెలియని సాయుధులు లోపలికి ప్రవేశించారు. మున్సిపల్ కౌన్సిలర్ రియాజ్ అహ్మద్, సెక్యూరిటీ గార్డు షఫ్‌ఖాత్ అహ్మద్‌పై తుపాకులతో కాల్పులు జరిపారు. దీంతో వారిద్దరూ అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయారు. శంషుద్దీన్ పీర్ అనే మరో కౌన్సిలర్ గాయపడ్డాడు. ఈ దాడిలో లష్కరే తోయిబాకు చెందిన ముదాసిర్ పండిట్ అనే ఉగ్రవాది ప్రమేయం ఉన్నట్లు పోలీసులు ప్రాథమికంగా నిర్ధారించారు.
కౌన్సిల్ సమావేశ మందిరంలోకి చొరబడి ఉగ్రవాదులు కాల్పులు జరపడాన్ని భారతీయ జనతా పార్టీ తీవ్రంగా ఖండించింది. ఉగ్రవాదులది పిరికిపంద చర్య అని విమర్శించింది. వారిని పట్టుకొని, కఠినంగా శిక్షించాలని బీజేపీ జమ్మూకశ్మీర్ అధ్యక్షుడు రవీందర్ రైనా డిమాండ్ చేశారు. మృతులకు నేషనల్ కాన్ఫరెన్స్ అధినేత ఒమర్ అబ్దుల్లా సంతాపం తెలిపారు.
ఈ దాడికి పాల్పడిన వారు స్థానిక ఎల్ఈటీ టెర్రరిస్టులని గుర్తించామని పోలీసులు అన్నారు. ఈ ఘటన వెనుక ముదాసిర్ పండిట్ సూత్రధారని, మరో విదేశీ మిలిటెంట్ కూడా ఉన్నాడని తెలిపారు. వారిని పట్టుకునేందుకు ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేశామని.. రెండు ప్రాంతాల్లో కార్డన్ సెర్చ్ ప్రారంభించామని తెలిపారు. ఈ దాడి జరిగిన ప్రాంతంలో అక్కడే ఉండి, సమయానికి ఉగ్రవాదులను అడ్డుకోలేకపోయిన నలుగురు అధికారులను సస్పెండ్ చేసినట్టు కాశ్మీర్ జోన్ఐజీ విజయ్ కుమార్ తెలియజేశారు.