మునావర్ ఫరూఖీ షో కు అనుమతి నిరాకరణ
Munawar Faruqui denied permission to perform in Delhi. ప్రముఖ కమెడియన్ మునావర్ ఫరూఖీ షో అంటే చాలు నిర్వాహకులు
By Medi Samrat Published on 27 Aug 2022 2:42 PM ISTప్రముఖ కమెడియన్ మునావర్ ఫరూఖీ షో అంటే చాలు నిర్వాహకులు కూడా భయపడుతూ ఉన్నారు. అతడు గతంలో చేసిన వ్యాఖ్యలకు సంబంధించి హిందూ సంఘాలు తీవ్ర నిరసనను వ్యక్తం చేస్తూ ఉన్నాయి. ఇటీవల హైదరాబాద్ లో నిర్వహించిన షో ఎంతటి ఉద్రిక్తతలకు దారి తీసిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఇక అతడు ఇతర నగరాల్లో నిర్వహించే షోలపై కూడా ప్రభావం కనిపిస్తోంది. ఆగస్టు 28న ఢిల్లీలో జరగాల్సిన మునావర్ ఫరూఖీ ప్రదర్శనకు ఢిల్లీ పోలీసులు అనుమతి నిరాకరించారు. సెంట్రల్ డిస్ట్రిక్ట్ పోలీసు విభాగం ఒక నివేదికలో అతడి షో మత సామరస్యాన్ని ప్రభావితం చేస్తుందని పేర్కొంది. కేదార్‌నాథ్ సాహ్ని ఆడిటోరియంలోని డాక్టర్ ఎస్‌పిఎం సివిక్ సెంటర్‌లో మధ్యాహ్నం 2 గంటల నుంచి రాత్రి 9.30 గంటల వరకు ప్రదర్శన జరగాల్సి ఉంది. ఇది ప్రయివేటుగా నిర్వహించే షో, దీనికి ఇంతకు ముందు అనుమతి ఇచ్చారు.
హైదరాబాద్ సహా పలుచోట్ల చోటచేసుకున్న పరిణామాల కారణంగా పోలీసులు ఢిల్లీలో షోకు అనుమతి నిరాకరించారు. మునావర్ షో కారణంగా మతపరమైన ఉద్రిక్తతలు చోటుచేసుకునే అవకాశం ఉందని.. సెంట్రల్ డిస్ట్రిక్ట్ పోలీసుల రిపోర్ట్ ఆధారంగా మునావర్ షో కోసం చేసుకున్న దరఖాస్తును ఢిల్లీ పోలీసులు తిరస్కరించారు. మునావర్ ఫారూఖీ షోపై ఆగస్టు 25న ఢిల్లీ పోలీస్ కమిషన్ సంజయ్ అరోరాకు విశ్వహిందూ పరిషత్ లేఖ కూడా రాసింది. హిందూ దేవతలను కించపరుస్తూ మాట్లాడిన కమెడీయన్ ఫారూఖీ కారణంగా హైదరాబాద్‌లో ఉద్రిక్తతలు చోటుచేసుకున్నాయని.. ఢిల్లీలో అనుమతి నిరాకరించకుండా ఉంటే.. నిరసన ప్రదర్శన చేపడతామని వీహెచ్‌పీ, భజరంగ్‌దళ్ పేర్కొంది. ఇప్పటికే బెంగళూరు నగరంలోనూ మునావర్ ఫారూఖీ షోకు అక్కడి పోలీసులు అనుమతి నిరాకరించారు.
హిందూ దేవతలతో పాటు కేంద్ర హోంమంత్రి అమిత్ షాపై అభ్యంతరకర వ్యాఖ్యలు చేశారంటూ బీజేపీ ఎమ్మెల్యే మాలినీ లక్ష్మణ్ సింగ్ గౌడ్ కుమారుడు ఏకలవ్య సింగ్ గౌడ్ ఫిర్యాదు మేరకు ఫరూఖీతో పాటు మరో నలుగురిని ఈ ఏడాది జనవరి 1న మధ్యప్రదేశ్ పోలీసులు అరెస్ట్ చేశారు. న్యూ ఇయర్ రోజున ఇండోర్‌లోని ఒక కేఫ్‌లో కామెడీ షో సందర్భంగా అతడు కొన్ని వివాదాస్పద వ్యాఖ్యలు చేశాడు. అనంతరం బెయిల్‌పై విడుదలయ్యాడు.