నీళ్లు కూడా ఇవ్వలేదన్న నవనీత్ రాణా.. వీడియో విడుదల చేసిన ముంబై పోలీసులు..
Mumbai top cop shares video of Rana couple having tea in custody. మహారాష్ట్రలో హనుమాన్ చాలీసా వివాదం నడుస్తూ ఉన్న సంగతి తెలిసిందే.
By M.S.R
మహారాష్ట్రలో హనుమాన్ చాలీసా వివాదం నడుస్తూ ఉన్న సంగతి తెలిసిందే..! ఎంపీ నవనీత్ కౌర్ రాణా సోమవారం నాడు పోలీసులపై తీవ్ర ఆరోపణలు చేస్తూ లోక్ సభ స్పీకర్ ఓం బిర్లాకు లేఖ రాశారు. శివసేనలో హిందుత్వ భావజాల జ్వాలను మళ్లీ రగిలించాలన్న ఉద్దేశంతోనే తాను సీఎం ఉద్ధవ్ థాకరే నివాసం ఎదుట హనుమాన్ చాలీసా పఠిస్తానని ప్రకటన చేశానని నవనీత్ కౌర్ రాణా స్పష్టం చేశారు. అంతేతప్ప, మతపరమైన ఉద్రిక్తతలను రెచ్చగొట్టాలన్నది తన అభిమతం కాదని తెలిపారు. మేం సీఎం నివాసం వద్దకు వెళ్లడంలేదని స్పష్టం చేశాం. నేను, నా భర్త రవి రాణా ఇంటికే పరిమితం అయ్యాం.. కానీ, 23వ తేదీన నన్ను, నా భర్తను ఖార్ పోలీస్ స్టేషన్ కు తీసుకెళ్లారు.
తాగేందుకు నీళ్లు ఇవ్వాలని ఎన్నిసార్లు అడిగినా పోలీసులు ఒక్కసారి కూడా స్పందించలేదు. రాత్రంతా మమ్మల్ని పోలీస్ స్టేషన్ లోనే ఉంచారు. ఇక, మంచినీళ్లు ఇవ్వకపోవడానికి అక్కడి పోలీసు సిబ్బంది చెప్పిన కారణం నన్ను దిగ్భ్రాంతికి గురిచేసింది. మేం షెడ్యూల్డ్ కులానికి చెందినందున అదే గ్లాసుతో నీళ్లు ఇవ్వబోమని చెప్పారు. నన్ను కులం పేరుతో నేరుగానే దూషించారు. కనీసం నేను బాత్రూంను వినియోగించుకోవాలని భావించినప్పుడు కూడా పోలీసుల నుంచి తీవ్ర అభ్యంతరకర పదజాలం ఎదురైంది. పోలీసులు ఎంతో దారుణమైన రీతిలో నన్ను దుర్భాషలాడారు. నిమ్న కులాల వారు మా బాత్రూంలు వినియోగించుకోవడాన్ని మేం అంగీకరించబోమని పోలీసులు చెప్పారని నవనీత్ కౌర్ లోక్ సభ స్పీకర్ కు రాసిన లేఖలో తెలిపారు.
Do we say anything more pic.twitter.com/GuUxldBKD5
— Sanjay Pandey (@sanjayp_1) April 26, 2022
నవనీత్ రాణా కస్టడీలో దారుణంగా ప్రవర్తించారనే ఆరోపణలపై ముంబై పోలీస్ కమిషనర్ సంజయ్ పాండే స్పందిస్తూ, ఎంపీ, ఆమె ఎమ్మెల్యే భర్త రవి రాణా ఖర్ పోలీస్ స్టేషన్‌లో టీ తాగుతున్న వీడియోను షేర్ చేశారు. 'ఇంకా ఏమైనా చెప్పాలా?' అనే క్యాప్షన్‌తో వీడియోను పోస్ట్ చేశారు. అందులో పక్కన ఉన్న వ్యక్తులతో నవనీత్ రాణా దంపతులు మాట్లాడుతూ టీ తాగడం చూడవచ్చు.