Video : నిందితుడిని గుర్తించాం.. సైఫ్‌పై దాడి ఘ‌ట‌న‌పై డీసీపీ ఏమ‌న్నారంటే..

ప్రముఖ సినీ నటుడు సైఫ్ అలీఖాన్ జనవరి 16న తెల్లవారుజామున 2 గంటల ప్రాంతంలో దారుణంగా దాడికి గురయ్యారు.

By Medi Samrat  Published on  16 Jan 2025 3:16 PM IST
Video : నిందితుడిని గుర్తించాం.. సైఫ్‌పై దాడి ఘ‌ట‌న‌పై డీసీపీ ఏమ‌న్నారంటే..

ప్రముఖ సినీ నటుడు సైఫ్ అలీఖాన్ జనవరి 16న తెల్లవారుజామున 2 గంటల ప్రాంతంలో దారుణంగా దాడికి గురయ్యారు. ముంబైలోని బాంద్రాలోని సైఫ్ ఇంటి వద్ద దాడి చేసిన గుర్తుతెలియ‌ని వ్యక్తి అతనిపై కత్తితో దాడి చేశాడు. ఈ దాడిలో సైఫ్ తీవ్రంగా గాయపడి లీలావతి ఆసుపత్రిలో చేరాడు. ఈ మొత్తం విషయానికి సంబంధించి ముంబై పోలీస్ క్రైమ్ బ్రాంచ్ నుండి తాజా ప్రకటన వెలువడింది. నిందితుడిని గుర్తించినట్లు వారు తెలిపారు. అధికారుల‌ నుంచి దిగ్భ్రాంతికరమైన విషయాలు బ‌య‌ట‌కురాగా.. మొత్తం విషయాన్ని వివరంగా తెలుసుకుందాం.

సైఫ్ అలీఖాన్‌పై జరిగిన దాడిపై సినీ ప్రపంచంలో కలకలం రేగుతోంది. ఈ సంఘటన తర్వాత అందరూ షాక్ లో ఉన్నారు. ఈ మొత్తం వ్యవహారంపై విచారణ జరుపుతున్న ముంబై పోలీసుల నుంచి దాడిపై ప్రకటన వెలువడింది. క్రైమ్ బ్రాంచ్ డీసీపీ దీక్షిత్ గెడం మీడియాతో మాట్లాడుతూ.. దొంగతనం చేయాలనే ఉద్దేశంతో దాడి చేసిన వ్యక్తి సైఫ్ అలీఖాన్ ఇంట్లోకి ప్రవేశించాడు. ఫైర్ ఎస్కేప్ ఉప‌యోగించి సైఫ్ ఇంటి లోపలికి చేరుకున్నాడని.. సీసీటీవీ ఆధారంగా నిందితుడిని గుర్తించామ‌ని తెలిపారు. ఈ అంశంపై దర్యాప్తు చేసేందుకు 10 వేర్వేరు బృందాలను నియమించామ‌ని.. బాంద్రా పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు నమోదైందని.. సైఫ్ అలీఖాన్‌పై దాడి చేసిన వ్యక్తిని వీలైనంత త్వరగా అదుపులోకి తీసుకుంటామన్నారు.

ఈ సంఘటనకు సంబంధించి సైఫ్ ఇంటి పనిమనిషిని కూడా క్రైమ్ బ్రాంచ్ విచారించిందని, ఇంటి సిబ్బందిలోని మరో ఇద్దరు సభ్యులను కూడా విచారణ కోసం అదుపులోకి తీసుకున్నట్లు నివేదిక‌లు చెబుతున్నాయి.

దాడిలో సైఫ్ అలీఖాన్ తీవ్రంగా గాయపడ్డాడు. శరీరంపై 6 వేర్వేరు ప్రదేశాలలో కత్తిపోట్ల‌కు గురయ్యాడు. మెడ, చేతులు, వీపుపై లోతైన గాయాలున్నాయి. శస్త్రచికిత్సలో సైఫ్ వెన్నుపాము నుండి 2.5 అంగుళాల కత్తిని తొలగించినట్లు వైద్యులు తెలిపారు. ప్రస్తుతం సైఫ్ పరిస్థితి మెరుగ్గా ఉండ‌గా.. ఐసీయూలో వైద్యుల ప‌ర్య‌వేక్ష‌ణ‌లో ఉన్నారు.

Next Story