సచిన్ వాజే గురువు ప్రదీప్ శర్మ కూడా అరెస్టు..!
Mumbai Court Remands Former Encounter Specialist Pradeep Sharma To NIA Custody Till June 28. ముకేశ్ అంబానీ ఇంటి వద్ద పేలుడు పదార్థాలతో
By Medi Samrat Published on 17 Jun 2021 7:43 PM IST
ముకేశ్ అంబానీ ఇంటి వద్ద పేలుడు పదార్థాలతో నిలిపి ఉంచిన వాహనం గత ఫిబ్రవరిలో దేశ వ్యాప్తంగా సంచలనం సృష్టించింది. మహారాష్ట్రకు చెందిన పలువురు రాజకీయ నాయకులు సచిన్ వాజేతో కలిసి ఈ పనికి పాల్పడ్డారనే వార్తలు దేశ వ్యాప్తంగా హాట్ టాపిక్ గా మారాయి. ఈ కేసును జాతీయ దర్యాప్తు సంస్థ (ఎన్ఐఎ) విచారణ చేపట్టగా.. మాజీ పోలీసు అధికారి, ఎన్‌కౌంటర్ స్పెషలిస్టుగా గుర్తింపు పొందిన ప్రదీప్ శర్మ ఇంట్లో ఆరుగంటల పాటు సోదాలు చేపట్టి ఆయనపై ప్రశ్నల వర్షం కురిపించింది. ఆ తర్వాత ఆయన్ను అదుపులోకి తీసుకున్నారు. ఈ కేసులో షీలర్ అనే అనుమానితుడితో శర్మ గతంలో దిగిన ఫోటోలు బయటకు రావడంతో ఆయన పాత్రపై ఎన్ఐఏ ఆరా తీస్తోంది. షీలర్ గతంలో పోలీసు ఇన్‌ఫార్మర్‌గా పని చేశాడని, అయినా రోజూ తనతో ఎంతో మంది ఫొటోలు దిగుతారని ప్రదీప్ వివరణ ఇచ్చారు.
ఈ కేసులో ముంబై మాజీ పోలీసు అధికారి సచిన్ వాజేను ఇప్పటికే అరెస్టు చేశారు. వాజే -ప్రదీప్ శర్మ ఇద్దరూ మంచి స్నేహితులని తెలిసింది. ఎన్ కౌంటర్ స్పెషలిస్టు అయిన ప్రదీప్ శర్మను గతంలో రెండు సార్లు ఎన్ఐఏ విచారించింది. 1983 లో ముంబై పోలీసు శాఖలో ఎస్ఐగా జాయిన్ అయ్యారు. మహారాష్ట్ర పోలీస్ వర్గాల్లో ఎన్‌కౌంటర్ స్పెషలిస్ట్‌గా పేరున్న ప్రదీప్ శర్మపై 2006లో లఖన్ భయ్యా ఎన్‌కౌంటర్, ఈ ఘటనలో దావూద్ ఇబ్రహీం గ్యాంగ్‌కు సాయం చేశారన్న ఆరోపణలు రావటంతో వేటు పడింది. 2017లో తిరిగి విధుల్లో చేరిన ప్రదీప్ శర్మ 2019లో పోలీసు ఉద్యోగాన్ని వదిలేశారు. 2019 లో సర్వీసు నుంచి రిటైర్మెంట్ తీసుకున్న శర్మ.. శివసేన పార్టీలో చేరి మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల్లో నాలా సోపర నియోజకవర్గం నుంచి పోటీ చేసి ఓడిపోయారు.
ఈ కేసులో భాగంగా ముంబైలోని ప్రత్యేక ఎన్‌ఐఏ కోర్టు మాజీ ఎన్‌కౌంటర్ స్పెషలిస్ట్, శివసేన సభ్యుడు ప్రదీప్ శర్మతో పాటు మరో ఇద్దరిని జూన్ 28 వరకు జాతీయ దర్యాప్తు సంస్థ కస్టడీకి ఇచ్చింది.