గ్యాంగ్‌స్టర్ నుండి పొలిటీషియన్ గా మారిన ముఖ్తార్ అన్సారీని బుధవారం అలహాబాద్ హైకోర్టు లక్నో బెంచ్ దోషిగా నిర్ధారించింది. అన్సారీకి రెండేళ్ల జైలు శిక్ష పడింది. జస్టిస్ దినేష్ కుమార్ సింగ్‌తో కూడిన సింగిల్ జడ్జి ధర్మాసనం ఉత్తరప్రదేశ్ ప్రభుత్వం దాఖలు చేసిన పిటిషన్‌ను విచారించి ఈ తీర్పునిచ్చింది. జైలర్ ను ముఖ్తార్ అన్సారీ బెదిరించాడని.. అభియోగాలు మోపబడ్డాయి. ఆ అభియోగాలు ప్రూవ్ అవ్వడంతో అలహాబాద్ హై కోర్టు దోషిగా నిర్ధారించింది.
ఈ కేసు 2003 నాటిది, అప్పటి జైలర్ ఎస్‌కె అవస్తీ ఆలంబాగ్ పోలీస్ స్టేషన్‌లో ముఖ్తార్ అన్సారీపై ఎఫ్‌ఐఆర్ నమోదు చేశారు. జైలులో అన్సారీని కలవడానికి వచ్చిన వారిని తనిఖీ చేసినప్పుడు తనను బెదిరించాడని అవస్తీ ఆరోపించారు. అన్సారీ తనపై తుపాకీ గురిపెట్టాడని కూడా అవస్థి చెప్పాడు. ఈ కేసులో ముఖ్తార్ అన్సారీని ట్రయల్ కోర్టు విడుదల చేసింది. ట్రయల్ కోర్టు తీర్పుపై యూపీ ప్రభుత్వం హైకోర్టులో అప్పీలు చేసింది. ముఖ్తార్ అన్సారీ ప్రస్తుతం యూపీలోని బందా జైలులో ఉన్నారు. సుప్రీంకోర్టు ఆదేశాల తర్వాత ఏప్రిల్ 7న పంజాబ్ జైలు నుంచి బందా జైలుకు తీసుకొచ్చారు.