కాంగ్రెస్ అగ్రనేత రాహుల్‌గాంధీతో కలిసి భారత్ జోడో యాత్రలో పాల్గొన్న ఓ ప్రభుత్వ ఉపాధ్యాయుడిని ఉన్నతాధికారులు సస్పెండ్ చేశారు. ఒక రాజకీయ కార్యక్రమంలో పాల్గొని సర్వీస్ రూల్స్‌ను అతిక్రమించినందుకు ప్రభుత్వ ఉపాధ్యాయుడిని సస్పెండ్ చేస్తున్నామని ఉన్నతాధికారులు చెప్పారు. మధ్యప్రదేశ్ రాష్ట్రం బర్వానీ జిల్లా కనస్యలో ట్రైబల్ అఫైర్స్ డిపార్టుమెంట్ ఆధ్వర్యంలో నడుస్తున్న ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలలో రాజేశ్ కన్నోజీ అనే వ్యక్తి టీచర్ గా పని చేస్తున్నాడు. గత నెల 24న కన్నోజీ వ్యక్తిగత పనులు ఉన్నాయంటూ పాఠశాలకు సెలవు పెట్టి రాహుల్‌గాంధీ చేపట్టిన భారత్ జోడో యాత్రలో పాల్గొన్నాడు. యాత్రలో పాల్గొన్న ఫొటోలను సోషల్ మీడియాలో పోస్టు చేశాడు. అవి కాస్తా ఉన్నతాధికారుల కన్నుల్లో పడింది. దీంతో వారు ఆయన చర్యలను సీరియస్‌గా తీసుకున్నారు. రాజకీయ కార్యక్రమంలో పాల్గొని సర్వీస్ రూల్స్‌ను బ్రేక్ చేశారనే కారణంతో సస్పెండ్ చేశారు.
రాహుల్ భారత్ జోడో పాదయాత్ర 84వ రోజుకు చేరుకుంది. సెప్టెంబరు 7వ తేదీన రాహుల్ భారత్ జోడో పాదయాత్ర తమిళనాడులోని కన్యాకుమారి నుంచి ప్రారంభమయింది.తమిళనాడు, కేరళ, కర్ణాటక, ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, మహారాష్ట్ర లలో రాహుల్ పాదయాత్ర పూర్తి చేసుకుంది. ప్రస్తుతం మధ్యప్రదేశ్ లో కొనసాగుతుంది. మధ్యప్రదేశ్ తర్వాత రాజస్థాన్ లోకి రాహుల్ యాత్ర ప్రవేశించనుంది.