కమ్యూనిస్టు పార్టీలకు.. మావోయిస్టుల ఉద్యమానికి తేడా తెలియదా..? అమిత్ షాపై నిప్పులు చెరిగిన కాంగ్రెస్‌ ఎంపీ

కేంద్ర హోంమంత్రి అమిత్ షాకు.. కమ్యూనిస్టు పార్టీలకు.. మావోయిస్టుల ఉద్యమానికి తేడా తెలియదని.. నాగర్‌కర్నూల్ ఎంపీ డా.మల్లు రవి ఎద్దేవా చేశారు.

By -  Medi Samrat
Published on : 1 April 2026 3:15 PM IST

కమ్యూనిస్టు పార్టీలకు.. మావోయిస్టుల ఉద్యమానికి తేడా తెలియదా..? అమిత్ షాపై నిప్పులు చెరిగిన కాంగ్రెస్‌ ఎంపీ

కేంద్ర హోంమంత్రి అమిత్ షాకు.. కమ్యూనిస్టు పార్టీలకు.. మావోయిస్టుల ఉద్యమానికి తేడా తెలియదని.. నాగర్‌కర్నూల్ ఎంపీ డా.మల్లు రవి ఎద్దేవా చేశారు. కాంగ్రెస్ పార్టీ ఏనాడూ బుల్లెట్‌ను నమ్మలేదని.. బ్యాలెట్‌నే నమ్మిందని స్పష్టం చేశారు. కాంగ్రెస్ పార్టీ ఎవ్వరితో పొత్తు పెట్టుకున్నా.. రాజ్యాంగానికి లోబడే వ్యవహరించిందని వివరించారు. న్యూఢిల్లీలోని తెలంగాణ భవన్‌లో ఎంపీ మల్లు రవి మంగళవారం విలేఖరులతో మాట్లాడారు. ఈ సందర్భంగా కీలక వ్యాఖ్యలు చేశారు.

ఈ పార్లమెంట్ సెషన్ ఏప్రిల్ రెండో తేదీన ముగుస్తుంది. ఈ సెషన్‌లో ముఖ్యంగా మావోయిస్టుల లొంగుబాటు, ఆపరేషన్ కగార్‌పై చర్చ జరిగింది. మావోయిస్టులు అంతా సరెండర్ కావాలని కేంద్ర ప్రభుత్వం స్పష్టం చేసింది. ఆయుధాలు పట్టుకొని రాజ్యాంగానికి వ్యతిరేకంగా ప్రభుత్వం మీద పోరాటం చేస్తున్నారు కాబట్టి.. సరెండర్ కాకపోతే మీరు ఏ ఆయుధాలతోటి ప్రభుత్వం మీద పోరాటం చేస్తున్నారో.. అదే ఆయుధాలతోని మీ మీద కూడా పోరాటం చేస్తామని హెచ్చరించింది. ఈ మార్చి నేలాఖరు లోపల మావోయిస్టులు లేకుండా చేస్తామని హోం మంత్రి అమిత్ షా స్టేట్మెంట్ ఇచ్చారు.

మావోయిస్టుల విషయంలో గత సంవత్సరం నుంచి ఇప్పటివరకు ఏం జరిగిందో.. ఏ రకంగా మావోయిస్టు రహిత భారత దేశంగా మారిందనే అంశంపై కేంద్ర హోంమంత్రి అమిత్ షా నిన్న పార్లమెంటులో మాట్లాడారు. ఈ మావోయిస్టుల మీద జరిగినటువంటి చర్చలో కాంగ్రెస్ పార్టీ తరఫున నేను కూడా మాట్లాడాను.

మావోయిస్టులకు లెఫ్ట్ వింగ్ ఎక్స్‌స్ట్రీమిజమ్ అని పేరు పెట్టారు. దీన్నే నక్సలిజం, మావోయిజం అని అంటున్నారు. దీని మీద అమిత్ షా మాట్లాడుతూ.. నక్సలైట్స్ వల్ల ఎంత భూభాగం వారి ఆధీనంలోకి పోయింది, ఎంతమంది ప్రజలు వారి ఆధీనంలోకి పోయారు, ఏ రకంగా ప్రజా కోర్టులు పెట్టి ప్రభుత్వానికి ఛాలెంజ్‌గా నిలిచారు, ఎంతమంది సీఆర్పీఎఫ్ పోలీస్ అఫీషియల్స్ నక్సలైట్ల కాల్పుల్లో చనిపోయారు, ఏ రకంగా రాజకీయ నాయకులు చనిపోయారు.. ఈ లెక్కలన్నీ ఇచ్చారు. ఈ లెక్కలపై మాకేం అభ్యంతరం లేదు.

కానీ ఈ లెక్కలు చెబుతూ అమిత్ షా.. ఇందిరా గాంధీ పేరును పదేపదే ప్రస్తావించారు. వీవీ గిరి, నీలం సంజీవరెడ్డి ఇద్దరూ రాష్ట్రపతి ఎన్నికల్లో పోటీ చేస్తున్నప్పుడు.. ఇందిరాగాంధీ మావోయిస్టులతో అలయన్స్ పెట్టుకున్నారని అమిత్ షా చెప్పారు. ఇంతటితో ఆగకుండా 2004లో కూడా మన్మోహన్ సింగ్ ప్రధాని కావడానికి మావోయిస్టు పార్టీలతో పొత్తు పెట్టుకున్నారని అన్నారు. రాహుల్ గాంధీ భారత్ జోడో యాత్ర చేస్తున్నప్పుడు.. తెలంగాణలో ఒకే డయాస్ మీద గద్దర్‌తో కలిసి రాహుల్ గాంధీ మాట్లాడారని అమిత్ షా చెప్పారు.

కాంగ్రెస్ పార్టీపై రాజకీయంగా బురద జల్లాలని ఇందిరా గాంధీ మొదలు మన్మోహన్ సింగ్, రాహుల్ గాంధీ వరకు అందరి పేర్లను అమిత్ షా ప్రస్తావించారు. 1969, 70 సమయంలో సీపీఐ సపోర్ట్‌ను ఇందిరాగాంధీ తీసుకున్న మాట వాస్తవమే. కానీ ఆ సమయంలో సీపీఐ రాజ్యాంగానికి వ్యతిరేకంగా ఆయుధాలు పట్టుకొని పోరాటం చేయలేదు. అమిత్ షా ఈ విషయాన్ని తెలుసుకోవాలి.

మన దేశంలో మల్టీ పొలిటికల్ పార్టీస్ ఏర్పాటు చేసుకుని అవకాశం ఉంది. అన్ని పార్టీలు రాజ్యాంగానికి లోబడి ఎన్నికల్లో నిలబడే అవకాశం ఉంది. ఇందిరాగాంధీ ఏ సమయంలో సపోర్టు తీసుకున్నా కూడా.. రాజ్యాంగం నిషేధించిన పార్టీలతో ఎప్పుడు పొత్తు పెట్టుకోలేదు. మన్మోహన్ సింగ్ సపోర్ట్ తీసుకున్న సీపీఐ, సీపీఎం పార్టీలు కూడా రాజ్యాంగం నిషేధించిన పార్టీలు కాదు.

రాహుల్ గాంధీ భారత్ జోడో యాత్ర తెలంగాణలోకి చేరినప్పుడు గద్దర్‌తో వేదిక పంచుకున్న మాట నిజమే. కానీ అప్పటికే గద్దర్ నక్సలైట్ ఉద్యమాల నుంచి బయటకు వచ్చారు. బ్యాలెట్ తోనే అధికార మార్పిడి జరుగుతుందనీ.. ఓటర్ లిస్టులో తన పేరును నమోదు చేసుకున్న తర్వాతే రాహుల్ గాంధీ గద్దర్‌తో వేదిక పంచుకున్నారు.

గద్దర్ ఆయుధాలతో ఉన్నప్పుడు రాహుల్ గాంధీ ఆయనతో వేదిక పంచుకున్నట్టు అమిత్ షా క్రియేట్ చేశారు. ఇందిరాగాంధీ, మన్మోహన్ సింగ్, రాహుల్ గాంధీ ప్రతిష్టను దెబ్బతీసేలా అమిత్ షా మాట్లాడారు. దీనిని మేము తీవ్రంగా ఖండిస్తున్నాం.

కాంగ్రెస్ పార్టీ ఎప్పుడు కూడా రాజ్యాంగాన్ని గౌరవిస్తూనే.. రాజ్యాంగానికి లోబడి పార్టీని, ప్రభుత్వాన్ని నడిపించింది. బ్యాలెట్ పేపర్ ద్వారానే అధికారాన్ని సాధిస్తామని కాంగ్రెస్ పార్టీ బలంగా నమ్ముతుంది. ఇదే విషయాన్ని పార్లమెంటులో కూడా నేను ప్రస్తావించాను.

బుల్లెట్‌ను నమ్ముకొని అధికారం సాధిస్తామని కాంగ్రెస్ పార్టీ ఏనాడు నమ్మదు. ప్రజాస్వామ్యయుతంగా బ్యాలెట్ ద్వారానే అధికారాన్ని సాధించాలని కాంగ్రెస్ పార్టీ పనిచేస్తుంది. స్వాతంత్రం రాకముందు కూడా అహింసా మార్గంలోనే పోరాటం చేశాం. స్వాతంత్రం వచ్చాక రాజ్యాంగం ప్రకారం.. సామాజిక, ఆర్థిక, రాజకీయ అసమానతలను తొలగించడానికి కాంగ్రెస్ పార్టీ కృషి చేసింది. ఆయుధాలు పట్టుకొని అధికారం సాధించాలని ఆలోచనకు కాంగ్రెస్ పార్టీ పూర్తి వ్యతిరేకం.

పశ్చిమ బెంగాల్ రాష్ట్రంలో దాదాపు 30 ఏళ్లు బ్యాలెట్ ద్వారానే కమ్యూనిస్టు పార్టీలు అధికారంలోకి వచ్చాయి. అదే రకంగా కేరళ రాష్ట్రంలో కూడా బ్యాలెట్ ద్వారానే సీపీఐ, సీపీఎం పార్టీలు అధికారంలోకి వచ్చాయి. అంతేకానీ ఆయుధాలు చేతబట్టి బుల్లెట్‌ను నమ్ముకొని ఏ రోజు రాజకీయం చేయలేదు.

బ్యాలెట్‌ను నమ్ముకున్న పార్టీలతో.. ఏ పార్టీ అయినా పొత్తులో ఉండవచ్చు. రాజకీయం చేయవచ్చు. జనతా పార్టీ ఏర్పడ్డ సమయంలో సీపీఐ, సీపీఎం కూడా ఆ పార్టీతో ఉన్నాయి. ఆ రోజుల్లో బీజేపీ, జన్‌సంఘ్ కూడా ఆ పొత్తులో ఉన్నాయి. ఆ విషయాన్ని మాత్రం నిన్న అమిత్ షా ప్రస్తావించలేదు.

మీరు సీపీఐ, సీపీఎం పార్టీలతో కలిస్తే తప్పులేదు.. కానీ ఇందిరాగాంధీ, రాజీవ్ గాంధీ, రాహుల్ గాంధీ కలిస్తే తప్పా.. మీరు ఏ పార్టీతో అయినా పొత్తు పెట్టుకోవచ్చు.. కానీ వేరే వారు పెట్టుకుంటే తప్పు అవుతుందా.. గతాన్ని మర్చిపోయి అమిత్ షా ఇష్టం వచ్చినట్లు మాట్లాడారు. దేనిని మేము తీవ్రంగా ఖండిస్తున్నాం.. అని ఎంపీ డా. మల్లు రవి వ్యాఖ్యానించారు.

రాజ్యసభలో కేంద్రమంత్రి కాళేశ్వరం ప్రాజెక్టు గురించి చేసిన వ్యాఖ్యలపైనా మల్లు రవి స్పందించారు. ఇప్పుడు కేంద్రమంత్రి కాదు.. గతంలో ప్రధాని మోదీ, అమిత్ షా కూడా కాళేశ్వరంపై కీలక వ్యాఖ్యలు చేశారు. గత ప్రభుత్వానికి కాళేశ్వరం ఏటీఎంలా మారిందన్నారు. బండి సంజయ్ ఒక అడుగు ముందుకేసి.. జైళ్లో వేస్తామన్నారు. కానీ ఏనాడూ ఏ చర్య తీసుకోలేదు. తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చాక.. చట్టబద్ధంగా ప్రభుత్వం చర్యలు తీసుకుంటోందని.. మల్లు రవి స్పష్టం చేశారు.

Next Story