సభకు మొదటిసారి వచ్చాం.. బాధగా ఉంది.. ప్రతిపక్షాల తీరుపై ఎంపీ కంగనా
మెడికల్ ప్రవేశ పరీక్ష నీట్-యుజి పేపర్ లీక్‌పై గందరగోళం నేపథ్యంలో లోక్‌సభ కార్యకలాపాలు సోమవారం అంటే జూలై 1 ఉదయం 11 గంటలకు వాయిదా పడ్డాయి.
By Medi Samrat Published on 28 Jun 2024 2:56 PM ISTమెడికల్ ప్రవేశ పరీక్ష నీట్-యుజి పేపర్ లీక్‌పై గందరగోళం నేపథ్యంలో లోక్‌సభ కార్యకలాపాలు సోమవారం అంటే జూలై 1 ఉదయం 11 గంటలకు వాయిదా పడ్డాయి. ఈ రోజు మధ్యాహ్నం 12 గంటలకు లోక్‌సభ సమావేశాలు ప్రారంభమైనప్పటికీ విపక్షాలు రచ్చ కొనసాగించాయి. నీట్ పేపర్ లీక్ అంశంపై తక్షణమే చర్చ జరగాలని విపక్ష ఎంపీలు పట్టుబట్టారు. లోక్‌సభ స్పీకర్ విపక్ష ఎంపీలను శాంతింపజేసి, పార్లమెంటును నడపనివ్వకపోవడం పార్లమెంటరీ ప్రజాస్వామ్యానికి విరుద్ధమని అన్నారు. రాష్ట్రపతి ప్రసంగంపై చర్చ సందర్భంగా సభ్యులు ఈ అంశంపై చర్చించవచ్చని, తాను అనుమతిస్తానని చెప్పారు.
ఈ విషయమై బీజేపీ ఎంపీ, నటి కంగనా రనౌత్ హౌస్ నుండి బయటకు వస్తూ.. వార్తా సంస్థ ANI తో మాట్లాడుతూ.. అక్కడ వారి (ప్రతిపక్షాల) ప్రవర్తనను మీరు చూశారు. స్పీకర్ కూడా వారిని మందలించారు. కానీ వారు (ప్రతిపక్షం) ఎవరి మాట వినడానికి సిద్ధంగా లేరని తెలుస్తోంది. మేము మొదటిసారి ఇక్కడకు వచ్చాము. ఏమి జరిగిందో అని మేము ఆశ్చర్యపోయాము. విపక్షాలు ఎవరినీ మాట్లాడనివ్వకుండా ఉండటం బాధగా అనిపించింది. రాష్ట్రపతి ప్రసంగంపై ధన్యవాద తీర్మానంపై చర్చను మరచిపోతున్నారు. వారు ఏకపక్షంగా వ్యవహరిస్తున్నారు.. ఈ విధమైన ప్రవర్తన ఆమోదయోగ్యంగా ఉండకూడదని నేను భావిస్తున్నానని అన్నారు.
సభా కార్యక్రమాలను ముందుకు తీసుకెళ్లేందుకు లోక్‌సభ స్పీకర్ కేంద్ర మంత్రి కిరణ్ రిజిజు పేరును పిలిస్తే.. ప్రతిపక్ష ఎంపీలు వెల్‌లోకి వచ్చి నీట్‌పై చర్చ చేపట్టాలని నినాదాలు చేయడం ప్రారంభించారు. లోక్‌సభ స్పీకర్ ఓం బిర్లా సభా కార్యకలాపాలను కొనసాగించడానికి అనుమతించాలని విజ్ఞప్తి చేస్తూ.. సభను నడపనివ్వండి. ప్రారంభంలోనే సభను అనుకున్న విధంగా నిర్వహించనివ్వకపోవడం సరికాదని, ఇది ప్రజాస్వామ్యానికి తగదని, ప్రతి ఒక్కరి బాధ్యత అని అన్నారు.
కేంద్ర పార్లమెంటరీ వ్యవహారాల శాఖ మంత్రి కిరెన్ రిజిజు కూడా లేచి నిలబడి రాష్ట్రపతి ప్రసంగానికి ధన్యవాద తీర్మానంపై చర్చ సందర్భంగా పార్లమెంటు చరిత్రలో మరే ఇతర అంశంపై చర్చించే సంప్రదాయం లేదని అన్నారు. కాంగ్రెస్, దాని మిత్రపక్షాల తీరును తాము ఖండిస్తున్నామన్నారు.