కర్ణాటకలో విషాద ఘటన చోటు చేసుకుంది. అతివేగంగా వీస్తున్న గాలుల కారణంగా విద్యుత్ వైర్ తెగి మీద పడిపోవడంతో 45 ఏళ్ల మహిళ, ఆమె ఇద్దరు కుమారులు మృతి చెందారు. ఈ సంఘటన చించోలి పట్టణంలో ఆదివారం ఉదయం చోటుచేసుకుంది. మృతులను ఝరణమ్మ అంబన్న బసగోండ్ (45), ఆమె కుమారులు మహేశ్ అంబన్న బాసగోండ్ (20), సురేశ్ అంబన్న బాసగోండ్ (18)గా గుర్తించారు. విషయం తెలుసుకున్న పోలీసులు వెంటనే సంఘటనా స్థలానికి చేరుకున్నారు. వారి మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం చందాపూర్ తాలూకా ఆసుపత్రికి తరలించారు.
కుటుంబం తమ ఇంటి బయట ఉన్న పంటను టార్పాలిన్ షీట్‌తో కప్పడానికి ప్రయత్నించినప్పుడు ఈ విషాద సంఘటన జరిగింది. కుటుంబ సభ్యులు పంటను టార్పాలిన్‌తో కప్పే ప్రయత్నం చేస్తున్నప్పుడు.. ఒక్కసారిగా బలమైన గాలులు వీచాయి. దీంతో పక్కనే ఉన్న విద్యుత్ వైర్లు తెగి మీద పడ్డాయని స్థానికులు అంటున్నారు. కర్నాటకలోని కలబుర్గి జిల్లాలో గత రెండు రోజులుగా భారీ వర్షాలు కురుస్తున్నాయి. భారీగా గాలులు కూడా వీస్తుండటంతో ద్రాక్ష, జొన్నతో సహా పంటలు నాశనమయ్యాయి.