ఎత్తైన భవనాల బాల్కనీల నుండి పిల్లలు పడిపోయే దురదృష్టకర వార్తలను మీరు విని ఉండవచ్చు. కానీ ఒక తల్లి తన కొడుకును 10వ అంతస్తులోని బాల్కనీ నుండి వేలాడదీసిన సందర్భాన్ని మీరు ఎప్పుడైనా చూశారా? ఫరీదాబాద్‌లోని ఓ హైరైజ్‌లోని బాల్కనీకి ఓ తల్లి తన కొడుకును బెడ్‌షీట్‌తో వేలాడదీసిన ఘటన వెలుగులోకి వచ్చింది. ప్రస్తుతం వైరల్‌గా మారిన ఈ ఘటనకు సంబంధించిన వీడియోలో కొడుకు బెడ్‌షీట్‌కు వేలాడుతూ కనిపించాడు. కానీ ఆమె అలా ఎందుకు చేసిందంటే.. తొమ్మిదో అంతస్తులో తాళం వేసి ఉన్న ఇంటి బాల్కనీలో పడిపోయిన చీరను తీసుకురావడానికి. కొడుకు బెడ్‌షీట్‌పైకి ఎక్కుతుండగా, అతని తల్లి, ఇతర కుటుంబ సభ్యులు అతన్ని పైకి లాగడం వీడియోలో ఉంది.
గత వారం ఫరీదాబాద్‌లోని సెక్టార్ 82లోని ఓ సొసైటీలో ఈ ఘటన జరిగింది. ఎదురుగా ఉన్న భవనంలో నివాసం ఉంటున్న వ్యక్తి ఈ వీడియోను చిత్రీకరించాడు. పొరుగువారిలో ఒకరు తెలిపిన వివరాల ప్రకారం.. తాళం వేసి ఉన్న ఇంటి నుండి చీరను ఎలా తిరిగి పొందాలనే దానిపై మహిళ ఎవరి సహాయం లేదా సలహా తీసుకోలేదు. ఏకపక్షంగా తన కొడుకు ప్రాణాలకు హాని కలిగించాలని నిర్ణయించుకుంది. "ఇది ఫిబ్రవరి 6 లేదా 7న జరిగింది. చీర కోసం ఆ మహిళ తన కొడుకును అపాయం చేయాలని నిర్ణయించుకుంది. అంత ప్రమాదకరమైన పని చేయకుండా సొసైటీ మెయింటెనెన్స్‌ను సంప్రదించి ఉండాల్సింది" అని పొరుగువారు చెప్పారు. ఈ ఘటనపై సొసైటీ ఆమెకు నోటీసులు జారీ చేసింది. అయితే ఆ మహిళ తన నిర్ణయానికి చింతిస్తున్నట్లు తెలిపింది.