కేరళ రాష్ట్రంలో ఓ వైపు కరోనా మహమ్మారి విజృంభిస్తుంటే.. మరో వైపు మంకీ ఫీవర్ కలకలం రేపుతోంది. దేశంలో కరోనా కేసులు తగ్గుతున్నా.. కేరళలో మాత్రం భారీగానే కరోనా కేసులు నమోదవుతున్నాయి. ఇదిలా ఉంటే కేరళలో తాజాగా మంకీ ఫీవర్ కలవరం కలిగిస్తోంది. వాయనాడ్ జిల్లాలోని తిరున్నెల్లి గ్రామ పంచాయితీలోని పనవల్లి గిరిజన స్థావరానికి చెందిన 24 ఏళ్ల వ్యక్తికి మంకీ ఫీవర్ సోకింది. దీన్ని క్యాసనూర్ ఫారెస్ట్ డిసీజ్ (కెఎఫ్‌డి) అని కూడా పిలుస్తున్నట్లు ఆరోగ్య శాఖ అధికారులు తెలిపారు.
జిల్లా వైద్యాధికారి డాక్టర్ సకీనా మాట్లాడుతూ.. సీజనల్ ఫీవర్ కావడంతో, ఆరోగ్య అధికారులు ఇప్పటికే అప్రమత్తం చేశారని, స్థానిక ప్రజలు జాగ్రత్తగా ఉండాలని కోరారు. 24 ఏళ్ల యువకుడిని మనంతవాడి మెడికల్ కాలేజీలో చేర్పించి వైద్యుల పరిశీలనలో ఉన్నారని ఆమె తెలిపారు. ఆయన ఆరోగ్య పరిస్థితి నిలకడగా ఉందని, ఇంతవరకు మరే ఇతర కేసు నమోదు కాలేదని ఆమె తెలిపారు. మంకీ ఫీవర్ అనేది దేశంలోని దక్షిణ భాగానికి చెందిన టిక్-బర్న్ వైరల్ హెమరేజిక్ జ్వరం. ఫ్లావివిరిడే కుటుంబానికి చెందిన వైరస్ వల్ల ఈ వ్యాధి వస్తుంది. ఇందులో కోతుల ద్వారా సంక్రమించే పసుపు జ్వరం, డెంగ్యూ జ్వరం కూడా ఉన్నాయి. ప్రస్తుత సంవత్సరంలో కేరళలో మంకీ ఫీవర్ కేసు నమోదవడం ఇదే తొలిసారి.