మోదీ అమెరికా ప్రయాణం.. ఏ రూట్ లో వెళ్లారంటే..
Modi's flight to US will avoid Kabul. భారత ప్రధాని నరేంద్ర మోదీ అమెరికా పర్యటనకు బయలుదేరి వెళ్లారు. అమెరికా అధ్యక్షుడు
By M.S.R Published on 22 Sept 2021 5:46 PM ISTభారత ప్రధాని నరేంద్ర మోదీ అమెరికా పర్యటనకు బయలుదేరి వెళ్లారు. అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ ఆహ్వానం మేరకు తాను ఆ దేశానికి వెళ్తున్నట్లు ట్విట్టర్ లో తెలిపారు. బైడెన్ అమెరికా అధ్యక్ష బాధ్యతలు చేపట్టాక మోదీ అమెరికాలో అడుగుపెడుతుండటం ఇదే తొలిసారి కావడంతో ఈ పర్యటన ఎంతో ప్రాధాన్యతను సంతరించుకుంది. రెండు దేశాల మధ్య సమగ్రమైన వాణిజ్య వ్యూహాత్మక భాగస్వామ్యం గురించి సమీక్షించనున్నట్లు మోదీ తెలిపారు. అమెరికా పర్యటన ద్వారా వ్యూహాత్మక బంధాన్ని బలోపేతం చేయనున్నట్లు తన ట్వీట్‌లో చెప్పారు. క్వాడ్ నేతల సదస్సులోనూ పాల్గొననున్నట్లు మోదీ తెలిపారు. అధ్యక్షుడు బైడెన్, ఆసీస్ ప్రధాని స్కాట్ మారిసన్, జపాన్ ప్రధాని మోషిహిడే సుగాలతో మోదీ భేటీ అవుతారు. ద్వైపాక్షిక సంబంధాలను బలోపేతం చేసేందుకు స్కాట్ మారిసన్, సుగాలతో వ్యక్తిగతంగా సమావేశం కానున్నట్లు ఆయన చెప్పారు. ఐక్యరాజ్యసమితి జనరల్ అసెంబ్లీ సమావేశాల్లోనూ ప్రసంగించనున్నట్లు తెలిపారు.
ఆయన ప్రయాణిస్తున్న విమానం పాకిస్థాన్ వాయు మార్గం ద్వారా వెళ్ళింది. ఆఫ్ఘనిస్తాన్ రూట్‌లో మోదీ ప్రయాణించే విమానం వెళ్లడం లేదని అధికారులు చెప్పారు. ప్రధాని విమానం తమ మార్గం ద్వారా వెళ్లేందుకు పాకిస్థాన్ అనుమతి ఇచ్చినట్లు కూడా అధికారులు తెలిపారు. ఆఫ్ఘనిస్తాన్ రూట్‌లో కమర్షియల్ ఫ్లయిట్లపై నిషేధం ఉన్న నేపథ్యంలో పాకిస్థాన్ వాయుమార్గం ద్వారా ప్రధాని మోదీ విమానం వెళ్లింది. ఆ విమానంలో ప్రధాని మోదీతో పాటు ఎన్ఎస్ఏ సలహాదారుడు అజిత్ దోవల్, విదేశాంగ కార్యదర్శి హర్షవర్దన్ శ్రింగాల్, ఇతర ప్రభుత్వ అధికారులు ఉన్నారు. బోయింగ్-777 విమానంలో అమెరికా వెళ్లారు. ఢిల్లీలోని వైమానికదళ ఎయిర్‌బేస్ నుంచి ఆ విమానం ఎగిరింది. వీవీఐపీలను అమెరికాకు తరలించేందుకు బోయింగ్-777 విమానాలను వాడుతుంటారు. భారత్ నుంచి అమెరికాకు బీ-777 నాన్ స్టాప్ విమాన ప్రయాణానికి 15 గంటల సమయం పడుతుంది.