19 ఏళ్లుగా మోదీ ఆ బాధ‌ను దిగ‌మింగుకున్నారు : అమిత్ షా

"Modiji Endured Silently For 19 Years": Amit Shah On Gujarat Riots Ruling.శివుడు త‌న గొంతులో విషాన్ని దాచిన‌ట్లుగా

By తోట‌ వంశీ కుమార్‌  Published on  25 Jun 2022 12:13 PM IST
19 ఏళ్లుగా మోదీ ఆ బాధ‌ను దిగ‌మింగుకున్నారు : అమిత్ షా

శివుడు త‌న గొంతులో విషాన్ని దాచిన‌ట్లుగా ప్ర‌ధాని మోదీ 19 ఏళ్లుగా బాధ‌ను దిగ‌మింగుకున్న‌ట్లు కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్ షా అన్నారు. 2002లో గుజ‌రాత్ అల్ల‌ర్ల కేసులో అప్ప‌టి సీఎంగా ఉన్న మోదీ ఆరోప‌ణ‌లు ఎదుర్కొన్నారు. కాగా.. ఆయ‌న‌కు వ్య‌తిరేకంగా ఎలాంటి ఆధారాలు లేవ‌ని సిట్ క్లీన్‌చిట్ ఇవ్వ‌గా.. నిన్న‌(శుక్ర‌వారం) సుప్రీం కోర్టు స‌మ‌ర్థించింది. ఈ నేప‌థ్యంలో ఓ మీడియా సంస్థ‌కు శ‌నివారం అమిత్ షా ఇంట‌ర్వ్యూ ఇచ్చారు.

19 ఏళ్లుగా త‌ప్పుడు ఆరోప‌ణ‌ల్ని మోదీ మౌనంగా ఎదుర్కొన్న‌ట్లు షా వెల్ల‌డించారు. మోదీపై విమ‌ర్శ‌లు వస్తున్నా.. ఎవ‌రూ కూడా ధ‌ర్నా చేయ‌లేద‌న్నారు. 19 ఏళ్లుగా గుజ‌రాత్ అల్ల‌ర్ల‌పై ఒక్క మాట కూడా మాట్లాడ‌కుండా మోదీ పోరాటం చేశార‌ని.. శివుడు త‌న గొంతులో విషాన్ని దాచిన‌ట్లు మోదీ కూడా ఆ బాధ‌ను దిగ‌మింగిన‌ట్లు తెలిపారు. ఎంతో దృడ సంక‌ల్పం క‌లిగి ఉంటేనే అలా నిశ్శ‌బ్ధంగా ఉండ‌డం సాధ్యమ‌ని అన్నారు. మోదీ బాధ‌ను చాలా ద‌గ్గ‌ర నుంచి చూచిన‌ట్లు తెలిపారు.

'గుజ‌రాత్ అల్ల‌ర్ల‌పై కొంద‌రు కావాల‌నే విష‌ప్ర‌చారం చేశారు. మోదీపై విమ‌ర్శ‌లు చేశారు. అయితే.. ఆ ఆరోప‌ణ‌ల నుంచి మోదీ బ‌య‌ట‌ప‌డ్డారు. సిట్ విచార‌ణ‌ను మేం ప్ర‌భావితం చేయ‌లేదు. సుప్రీం కోర్టు ప‌ర్య‌వేక్ష‌ణ‌లోనే ద‌ర్యాప్తు జ‌రిగింది. ఈ కేసు బీజేపీ ప్ర‌తిష్ట‌ను దెబ్బ‌తీసింది. అయితే.. ఇప్పుడు అంతా తొల‌గిపోయింద‌ని' అని అమిత్ షా అన్నారు.

ఇక‌.. సిట్ విచార‌ణ‌కు హాజ‌ర‌య్యే స‌మ‌యంలో మోదీ ధ‌ర్నా చేయ‌లేద‌ని, త‌న‌కు మ‌ద్ద‌తు ఇవ్వాల‌ని ఎమ్మెల్యేలు, ఎంపీల‌తో ధ‌ర్నా చేయించ‌లేద‌న్నారు. ఇటీవ‌ల నేష‌న‌ల్ హెరాల్డ్ కేసులో రాహుల్ గాంధీని ఈడీ విచారిస్తుంటే, ఆ పార్టీ నేత‌లు ధ‌ర్నాలు చేస్తున్నార‌న్న భావం వ‌చ్చే అమిత్ షా విమ‌ర్శ‌లు చేశారు.

Next Story