తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ కూతురు, బీఆర్‌ఎస్ నేత కల్వకుంట్ల కవిత ఢిల్లీలోని ఎక్సైజ్ పాలసీ కుంభకోణం కేసులో శనివారం ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ ముందు హాజరయ్యారు. కవిత శనివారం ఉదయం 11.05 గంటలకు ఈడీ కార్యాలయానికి చేరుకున్నారు. అందరికీ అభివాదం చేస్తూ కవిత ఈడీ కార్యాలయం లోపలికి వెళ్లారు. పిడికిలి బిగించి మనదే విజయం అనే సంకేతం ఇస్తూ కవిత కార్యాలయంలోకి వెళ్లారు. కవితకు మద్దతు తెలిపేందుకు భారీ సంఖ్యలో బీఆర్‌ఎస్ నేతలు తుగ్లక్‌రోడ్డులోని నివాసం వద్దకు చేరుకున్నారు. ఈ నేపథ్యంలో పోలీసులు పటిష్ఠ భద్రత ఏర్పాటు చేశారు.
మనీలాండరింగ్ నిరోధక చట్టంలోని సెక్షన్ 50 ప్రకారం కవిత స్టేట్‌మెంట్ రికార్డ్ చేయనున్నట్లు తెలుస్తోంది. మహిళా డిప్యూటీ డైరెక్టర్ స్థాయి అధికారి ఆమె వాంగ్మూలాన్ని నమోదు చేస్తారు. ఇదిలావుంటే.. ఎమ్మెల్సీ కవితను గురువారం విచారణకు హాజరవాల్సిందిగా సమన్లు అందాయి. అయితే కవిత సమయం కోరుతూ లేఖ రాశారు. దీంతో ఆమె విచారణ శనివారానికి వాయిదా పడింది. శుక్రవారం కల్వకుంట్ల కవిత.. మహిళా రిజర్వేషన్లపై జంతర్ మంతర్ వద్ద నిరసన చేపట్టారు. అనంతరం మాట్లాడుతూ.. ఢిల్లీ మాజీ ఉప ముఖ్యమంత్రి మనీష్ సిసోడియాను తాను ఎప్పుడూ కలవలేదని, తన పేరును అనవసరంగా ఈ విషయంలోకి లాగుతున్నారని పేర్కొంది.