రాజీనామా సమర్పించిన పళనిస్వామి.. నిరాడంబరంగా స్టాలిన్ ప్రమాణ స్వీకారం
MK Stalin swearing-in to take place on 7th May. తమిళనాడు ముఖ్యమంత్రి పదవికి పళనిస్వామి రాజీనామా చేశారు. మే 7న స్టాలిన్ ముఖ్యమంత్రిగా ప్రమాణస్వీకారం
By Medi Samrat Published on 3 May 2021 7:27 AM GMT
తమిళనాడు ముఖ్యమంత్రి పదవికి పళనిస్వామి రాజీనామా చేశారు. తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల్లో డీఎంకే కూటమి 156 సీట్లల్లో విజయం సాధించి, మ్యాజిక్ ఫిగర్ ను అధిగమించగా, అన్నాడీఎంకే కూటమి 74 సీట్లతో సరిపెట్టుకుంది. ముఖ్యమంత్రి ఎడప్పాడి కే పళనిస్వామి కొద్దిసేపటి క్రితం తన పదవికి రాజీనామా చేశారు. సేలంలో ఉన్న పళనిస్వామి తన కార్యదర్శి ద్వారా రాజీనామా లేఖను పంపించారని, గవర్నర్ కార్యాలయానికి ఈ లేఖ మధ్యాహ్నం ఒంటిగంట సమయంలో చేరుతుందని పార్టీ వర్గాలు వెల్లడించాయి. ఈ సందర్భంగా మాట్లాడిన పళనిస్వామి, స్టాలిన్ కు అభినందనలు తెలిపారు. స్టాలిన్ ట్వీట్ ద్వారా స్పందిస్తూ "మరింత మెరుగైన తమిళనాడు కోసం మీ సలహాలు, సూచనలు, సహకారం నాకు అవసరం. మనం ప్రజాస్వామ్యాన్ని కాపాడుదాం. పాలనలో విపక్షానికి ఉన్న ప్రాధాన్యత ఏంటో నాకు తెలుసు" అని అన్నారు.
ఇక కొత్త ప్రభుత్వాన్ని ఆహ్వానించి, పాలనా పగ్గాలను అందించేందుకు గవర్నర్ కార్యాలయం అధికారులు ఏర్పాటు చేస్తున్నాయి. మే 7న స్టాలిన్ ముఖ్యమంత్రిగా ప్రమాణస్వీకారం చేయబోతూ ఉన్నారు. ఈ విషయాన్ని డీఎంకే తెలిపింది. చాలా సింపుల్ గా ఈ ప్రమాణస్వీకారం ఉండబోతోంది. నిరాడంబరంగా స్టాలిన్ ప్రమాణ స్వీకారం చేయబోతున్నారని డీఎంకే వర్గాలు తెలిపాయి. ప్రస్తుతం ఉన్న పరిస్థితులను అర్థం చేసుకోవాలని.. కార్యకర్తలు దూరంగా ఉండాలని సూచించారు.