మేనల్లుడిని బీఎస్పీ నుంచి సస్పెండ్ చేసిన మాయావతి..కారణం అదేనని చెబుతూ ట్వీట్

బహుజన సమాజ్ పార్టీ అధ్యక్షురాలు, ఉత్తర ప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి మాయావతి సంచలన నిర్ణయం తీసుకున్నారు.

By Knakam Karthik
Published on : 3 March 2025 7:04 PM IST

National News, Bahujan Samaj Party, Mayawati, Akash Anand, Uttarpradesh

మేనల్లుడిని బీఎస్పీ నుంచి సస్పెండ్ చేసిన మాయావతి..కారణం అదేనని చెబుతూ ట్వీట్

బహుజన సమాజ్ పార్టీ అధ్యక్షురాలు, ఉత్తర ప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి మాయావతి సంచలన నిర్ణయం తీసుకున్నారు. గతంలో తన రాజకీయ వారసుడిగా ప్రకటించిన తన మేనల్లుడు ఆకాశ్ ఆనంద్‌ను బీఎస్పీ నుంచి సస్పెండ్ చేశారు. ఆకాశ్ తన మామ ప్రభావితంతో పని చేస్తున్నారని ఇది పార్టీ ప్రయోజనాలకు విఘాతం కలిగించే అంశం అని పేర్కొంటూ మాయావతి ఈ నిర్ణయం తీసుకున్నారు. పార్టీ ప్రయోజనాల దృష్ట్యా ఈ నిర్ణయం తీసుకున్నట్లు 'ఎక్స్' వేదిగా వెల్లడించారు. పార్టీకి సంబంధించి అన్ని కీలక పదవుల నుంచి అతడిని తొలగిస్తున్నట్లు ప్రకటించిన ఒక రోజులోపే బీఎస్పీ అధినేత్రి ఈ చర్యలు తీసుకున్నారు.

అంతకుముందు రోజు ఇదే విషయంపై మాయావతి మాట్లాడుతూ.. తనకు పార్టీయే ముఖ్యమని, ఆ తర్వాతే కుటుంబమని స్పష్టం చేశారు. పార్టీ విధానాలకు హాని కలిగించేలా తన పేరును ఎవరైనా దుర్వినియోగం చేస్తే వెంటనే తొలగిస్తానన్నారు. బీఎస్పీని రెండు వర్గాలుగా చీల్చి, బలహీనపరిచే ప్రయత్నం చేసిన ఆకాశ్ మామ అశోక్ సిద్దార్థ్‌ను ఈ నియమానికి అనుగుణంగానే గత నెల పార్టీ నుంచి బహిష్కరించామన్నారు.. ఇప్పుడు మేనల్లుడు ఆకాశ్‌పైనా చర్యలు తీసుకుంటున్నట్లు చెప్పారు. తన సోదరుడు ఆనంద్ కుమార్ మాత్రం పార్టీ నమ్మకాన్ని ఎన్నడూ వమ్ము చేయలేదన్న ఆమె.. పార్టీ జాతీయ ఉపాధ్యక్షుడిగా ఉన్న ఆనంద్ కుమార్‌తో పాటు రాజ్యసభసభ్యుడు రామ గౌతమ్‌ను బీఎస్పీ జాతీయ సమన్వయకర్తలుగా నియమిస్తున్నట్లు ప్రకటించారు.

కాగా ఆకాశ్‌ను గతంలో మాయావతి తన రాజకీయ వారసుడిగా ప్రకటించారు. ఈ క్రమంలో అతడిపై ఆరోపణలు రావడంతో ఆ ప్రకటనను ఉపసంహరించుకోవడంతో పాటు పార్టీ నుంచి గతంలోనూ సస్పెండ్ చేశారు. తాజాగా అదే సీన్ మరోసారి రిపీట్ కావడం బీఎస్పీలో చర్చనీయాంశమైంది.

Next Story