తమిళనాడు ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. మెట్రో ఛార్జీలు భారీగా తగ్గిస్తూ ప్రయాణికులకు శుభవార్త వినిపించింది. మొత్తంగా రూ.70 ఉన్న ఛార్జీపై ఏకంగా రూ.20 తగ్గిస్తూ నిర్ణయం తీసుకున్నారు ముఖ్యమంత్రి పళనీస్వామి. ఇప్పటి వరకు గరిష్ఠంగా రూ.70గా ఉన్న టికెట్ ఛార్జీపై రూ. 20 తగ్గిస్తూ రూ.50లకు పరిమితం చేశారు. ఈ తగ్గించిన ఛార్జీలు ఫిబ్రవరి 22 నుంచి అమల్లోకి రానున్నాయి.
ఇకపై మొదటి రెండు కిలోమీటర్ల ప్రయాణానికి రూ.10, 2 నుంచి 5 కిలోమీటర్ల వరకు రూ.20, అలాగే 5 నుంచి 12 కిలోమీటర్ల వరకు రూ.30, 12 నుంచి 21 కిలోమీటర్ల వరకు రూ.40, ఇక 21 నుంచి 32 కిలోమీటర్ల వరకు రూ.50 చెల్లించాల్సి ఉంటుందని తెలిపారు.
అంతకు ముందు ఉన్న ఛార్జీలు
ఇక అంతకు ముందున్న ఛార్జీల విషయానికొస్తే.. 0-2 కిలోమీర్ల వరకు రూ.10, 2 నుంచి 4 కిలోమీటరర్ల వరకు రూ.20, 4 నుంచి 6 కిలోమీటర్ల వరకు రూ.30, 6 నుంచి 12 కిలోమీటర్ల వరకు రూ.40, 12 నుంచి 18 కిలోమీటర్ల వరకు రూ.50, అలాగే 18 నుంచి 24 కిలోమీటర్ల వరకు రూ.60, 24 నుంచి అపై ఉన్న దూరానికి రూ.70 ఉండేది. అంతేకాదు మెట్రో రైల్ లిమిటెడ్ స్మార్ట్ కార్డ్ లేదా క్యూఆర్ కోడ్ ద్వారా చెల్లించే వారికి 20 శాతం రాయితీ ఇస్తున్నట్లు ముఖ్యమంత్రి పళనీస్వామి ప్రభుత్వం తెలిపింది. ఇక పబ్లిక్ హాలిడే, ఆదివారాల్లో రోజువారీ టికెట్ ధరపై 50 శాతం రాయితీ కూడా ఇస్తున్నట్లు ప్రకటించారు. కాగా, తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల సమయం దగ్గర పడుతుండటంతో ఈ నిర్ణయాలు తీసుకోవడం గమనార్హం.