ఉత్తరాఖండ్‌లో ఆకస్మిక వరదలు బీభత్సం సృష్టించాయి. ఖీర్ గంగా నది ఎగువ పరీవాహక ప్రాంతంలో మంగళవారం మేఘాల విస్ఫోటనం కారణంగా సంభవించిన వినాశకరమైన వరదలు ఉత్తరకాశి జిల్లాలోని ధరాలి గ్రామంలో పెద్ద ఎత్తున విధ్వంసం సృష్టించాయి. ఇది గంగోత్రి ధామ్‌కు వెళ్లే మార్గంలో కీలకమైన గమ్యస్థానం. హర్సిల్ ప్రాంతంలోని ఖీర్ గఢ్ నీటి మట్టం పెరగడం వల్ల ధరాలిలో గణనీయమైన నష్టం జరిగినట్లు నివేదికలు అందాయని జిల్లా పోలీసులు తెలిపారు. రాష్ట్ర విపత్తు ప్రతిస్పందన దళం (SDRF), సైన్యం ,స్థానిక అధికారుల బృందాలు సహాయ, రక్షణ కార్యకలాపాలను నిర్వహిస్తున్నాయని పోలీసు అధికారులు ధృవీకరించారు. ధరాలి గ్రామాన్ని ముంచెత్తిన వరద నీటి వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.