ఉత్త‌ర‌ప్ర‌దేశ్‌లో అగ్నిప్ర‌మాదం.. భారీగా ఆస్తి న‌ష్టం

Massive fire erupts in clothing showroom in UP’s Mathura.ఉత్తరప్రదేశ్‌లో భారీ అగ్నిప్ర‌మాదం చోటు చేసుకుంది.

By తోట‌ వంశీ కుమార్‌  Published on  1 Feb 2023 10:08 AM IST
ఉత్త‌ర‌ప్ర‌దేశ్‌లో అగ్నిప్ర‌మాదం.. భారీగా ఆస్తి న‌ష్టం

ఉత్తరప్రదేశ్‌లో భారీ అగ్నిప్ర‌మాదం చోటు చేసుకుంది. మధురలోని మూడు అంత‌స్థులు ఉన్న‌ దుస్తుల షోరూమ్‌లో బుధ‌వారం తెల్ల‌వారుజామున మంట‌లు చెల‌రేగాయి. బ‌ట్ట‌ల షోరూమ్ కావ‌డంతో క్ష‌ణాల్లోనే మంట‌లు ఉవ్వెత్తున ఎగిసిప‌డ్డాయి. బిల్డింగ్ మొత్తం వ్యాపించాయి. గ‌మ‌నించిన స్థానికులు అధికారులు, అగ్నిమాప‌క సిబ్బందికి స‌మాచారం ఇచ్చారు. వెంట‌ను ఆరు ఫైరింజ‌న్లు ఘ‌ట‌నాస్థ‌లానికి చేరుకున్నాయి. శ్ర‌మించి మంట‌ల‌ను అదుపులోకి తీసుకువ‌చ్చాయి.

భ‌వ‌నం మొద‌టి అంత‌స్తులో మంట‌లు చెల‌రేగాయి. అవి క్ర‌మంగా రెండు మూడు అంత‌స్తుల‌కు వ్యాపించాయి. మంట‌ల‌ను ఆర్పేందుకు మాకు చాలా సమయం పట్టింది. ప్ర‌స్తుతం మంటలు అదుపులోకి వచ్చాయని అగ్నిమాప‌క సిబ్బంది ఒక‌రు తెలిపారు. మంట‌లు ప‌క్క భ‌వ‌నాల‌కు వ్యాపించ‌కుండా జాగ్ర‌త్త‌లు చేప‌ట్టి మంట‌ల‌ను అదుపులోకి తీసుకువ‌చ్చిన‌ట్లు తెలిపారు.

మంటల్లో షోరూమ్ మొత్తం దగ్ధమైందని షోరూమ్ సమీపంలోని హోటల్ యజమాని శ్యామ్ సింఘాల్ తెలిపారు. "అగ్నిమాపక యంత్రాలు సమయానికి చేరుకున్నాయి. అయితే షోరూమ్ మొత్తం కాలిపోయింది. వచ్చిన నష్టం కోట్లలో ఉండాలి" అని సింఘాల్ అన్నారు.

కాగా.. మంట‌లు ఎలా అంటున్నాయి అన్న‌ది ఇంకా తెలియ‌రాలేదు. ఈ ప్ర‌మాదంలో ఎవ్వ‌రికి ఏమీ కాక‌పోవ‌డంతో అంద‌రూ ఊపిరిపీల్చుకున్నారు. అయితే.. భారీగా ఆస్తి న‌ష్టం వాటిల్లిన‌ట్లు తెలుస్తోంది.

Next Story