దేశ రాజధాని ఢిల్లీలో భారీ అగ్నిప్రమాదం చోటు చేసుకుంది. వజీర్‌పూర్ పారిశ్రామిక ప్రాంతంలో ఉన్న ఓ ఫ్యాక్టరీలో శుక్రవారం ఉదయం ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. ఉవ్వెత్తున మంటలు ఎగిసిపడుతుండడంతో పాటు దట్టమైన పొగ ఆ ప్రాంతంలో అలుముకుంది.
వివరాలు ఇలా ఉన్నాయి. వజీర్‌పూర్ ప్రాంతం ధర్మకాంత సమీపంలో ఉన్న కాస్మెటిక్, సాల్వెంట్ పరిశ్రమలో ఉదయం 8 గంటల సమయంలో మంటలు అంటుకున్నాయి. క్షణాల్లో మంటలు ఉవ్వెత్తున ఎగిసిపడ్డాయి. సమాచారం అందుకున్న వెంటనే 25 ఫైరింజన్లతో అగ్నిమాపక సిబ్బంది మంటలను అదుపులోకి తీసుకువచ్చేందుకు తీవ్రంగా శ్రమిస్తున్నారు. దట్టమైన పొగ ఆ ప్రాంతం మొత్తం అలుముకుంది.
మంటలు ఎలా అంటుకున్నాయన్నది తెలియాల్సి ఉంది. ప్రాణ నష్టం జరిగిందా..? ఎంత మేరకు ఆస్తి నష్టం జరిగింది అన్న వివరాలు మంటలు అదుపులోకి వస్తే గానీ తెలియవని అంటున్నారు. ఈ ప్రమాద సమాచారం తెలిసిన వెంటనే ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ ఈ ఘటనపై ఆరా తీసినట్లు తెలుస్తోంది.