పాతాల్‌కోట్ ఎక్స్‌ప్రెస్‌లో మంటలు

మథుర నుంచి ఝాన్సీ వైపు వస్తున్న పాతాల్‌కోట్ ఎక్స్‌ప్రెస్‌కు చెందిన రెండు జనరల్ బోగీలలో బుధవారం మంటలు చెలరేగాయి.

By Medi Samrat  Published on  25 Oct 2023 6:55 PM IST
పాతాల్‌కోట్ ఎక్స్‌ప్రెస్‌లో మంటలు

మథుర నుంచి ఝాన్సీ వైపు వస్తున్న పాతాల్‌కోట్ ఎక్స్‌ప్రెస్‌కు చెందిన రెండు జనరల్ బోగీలలో బుధవారం మంటలు చెలరేగాయి. భండాయ్ రైల్వే స్టేషన్ సమీపంలో ఈ ఘ‌ట‌న జ‌రిగింది. మంట‌లు చెల‌రేగ‌డంతో కోచ్‌లో ప్రయాణిస్తున్న వారు భయాందోళనల‌కు గుర‌య్యారు. రైలు ఆగిన తర్వాత ప్రయాణికులందరినీ సురక్షితంగా దించేశారు. స‌మాచారం అందిన వెంట‌నే రైల్వే అధికారులు సంఘటనా స్థలానికి చేరుకున్నారు. అగ్నిప్రమాదానికి గల కారణాలపై ఆరా తీస్తున్నారు. ఈ అగ్నిప్ర‌మాద ఘ‌ట‌న కార‌ణంగా ఆ రూట్‌లో రైళ్ల రాకపోకలు నిలిచిపోయాయి.

మధుర నుంచి ఝాన్సీ వెళ్తున్న పాతాల్‌కోట్ ఎక్స్‌ప్రెస్ బుధవారం మధ్యాహ్నం ఆగ్రా కాంట్ రైల్వే స్టేషన్‌కు చేరుకుంది. ఇక్కడి నుంచి ఝాన్సీకి బయల్దేరింది. రైలు కాంట్‌కు ఎనిమిది కిలోమీటర్ల దూరంలో ఉన్న భండాయ్ రైల్వే స్టేషన్‌ను దాటగానే.. అగ్నిప్ర‌మాదం సంభవించింది.

డ్రైవర్ ఎమర్జెన్సీ బ్రేకులు వేసి రైలును ఆపేశాడు. అగ్నిప్రమాదంపై రైల్వే కంట్రోల్‌ రూంకు సమాచారం అందించారు. రైలు ఆగిన వెంటనే బోగీ నుంచి దూకి ప్రయాణికులు ప్రాణాలు కాపాడుకున్నారు. అప్పటికి రెండు బోగీలు పూర్తిగా మంటల్లో కాలిపోయాయి. రైలులోని ఇతర కోచ్‌ల నుంచి వాటిని వేరు చేసేందుకు ప్రయత్నాలు ప్రారంభించారు. ఇంతలో అగ్నిమాపక దళం చేరుకుని మంటలను అదుపు చేసింది.

Next Story