New Year Celebrations : మాస్క్ తప్పనిసరి.. మహిళల పట్ల అసభ్యంగా ప్రవర్తిస్తే రూ.500 జరిమానా
నూతన సంవత్సర వేడుకల సందర్భంగా బహిరంగ ప్రదేశాల్లో మాస్క్‌లు ధరించడం తప్పనిసరి చేశారు బెంగళూరు పోలీసులు.
By Medi Samrat Published on 31 Dec 2024 2:05 PM ISTనూతన సంవత్సర వేడుకల సందర్భంగా బహిరంగ ప్రదేశాల్లో మాస్క్‌లు ధరించడం తప్పనిసరి చేశారు బెంగళూరు పోలీసులు. అలాగే ఈలలు వేయడం, శబ్దాలు చేయడం వంటివాటిపై నిషేదం విధించారు. న్యూ ఇయర్‌ను పురస్కరించుకుని బెంగళూరు అంతా ముస్తాబైంది. ప్రభుత్వం, పోలీసులు భద్రతా ఏర్పాట్లను ముమ్మరం చేశారు. కొత్త సంవత్సర వేడుకల్లో పాల్గొనేందుకు ప్రతి ఏటా లక్షలాది మంది ప్రజలు ఎంజీ రోడ్డుకు తరలివస్తుంటారు. దీంతో 2000 మంది పోలీసులను ఇక్కడ మోహరించారు. బ్రిగేడ్ రోడ్డు, చర్చి స్ట్రీట్, ఇందిరానగర్, హెచ్‌ఎస్‌ఆర్ లేఅవుట్, కోరమంగళ తదితర ప్రాంతాల్లో ప్రత్యేక లైటింగ్ ఏర్పాట్లు చేశారు. కోరమంగళలో భద్రతను కట్టడిచేసేందుకు అదనంగా 1000 మంది పోలీసులను మోహరించారు.
ప్రతి సందుగొందులను పర్యవేక్షించడానికి మినీ కంట్రోల్ రూములు ఏర్పాటుచేశారు. సున్నిత ప్రాంతాల్లో 150 సీసీ కెమెరాలు ఏర్పాటు చేశారు. MG రోడ్ నుండి మెట్రో, బస్సు సేవలు తెల్లవారుజామున 2 గంటల వరకు పనిచేస్తాయి. అయితే అన్ని ఫ్లై ఓవర్లు మూసి ఉంచబడతాయి. మహిళల పట్ల అసభ్యంగా ప్రవర్తిస్తే రూ.500 జరిమానా విధించి పోలీసులకు అప్పగిస్తామని బెంగళూరు మెట్రో రైల్ కార్పొరేషన్ తెలిపింది. ప్రతి మెట్రో కోచ్‌లో భద్రత కోసం పోలీసులను ఉంచనున్నారు.
మహిళల భద్రత కోసం రాణి చెన్నమ్మ స్పెషల్ స్క్వాడ్‌ను ఏర్పాటు చేస్తామన్నారు. ఆరోగ్య సదుపాయాలను కూడా మెరుగుపరిచారు. గతేడాది బెంగళూరు ట్రాఫిక్ పోలీసులు నూతన సంవత్సరం సందర్భంగా తనిఖీలు నిర్వహించి మద్యం మత్తులో బైక్‌లు నడుపుతున్న 330 మందిని పట్టుకున్నారు.
2017లో MG రోడ్‌లో పలువురు మహిళలపై వేధింపులకు పాల్పడిన ఘటనలు వెలుగులోకి రావడంతో బెంగళూరులో నూతన సంవత్సర వేడుకలు అట్టుడికిపోయాయి. వేలాదిగా తరలివచ్చిన జనాన్ని అదుపు చేసేందుకు పోలీసులు సైతం నానా తంటాలు పడాల్సి వచ్చింది.